ఎమ్మెల్సీ కవితకు 91 సీఆర్పీసీ నోటీసులు 

ఎమ్మెల్సీ కవితకు 91 సీఆర్పీసీ నోటీసులు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. నేడు దాదాపు 7 గంటలకు పైగా విచారించిన సీబీఐ అధికారులు వెళ్తూ ఆమెకు 91 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. తాము చెప్పిన చోట విచారణకు రావాలని ఆమెకు నిర్దేశించారు. త్వరలోనే విచారణకు సంబంధించిన తేదీలను తెలియచేస్తామని సీబీఐ అధికారులు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి నేడు విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు లేదా డిజిటల్ డివైజ్ ను నిర్ణీత గడువులోగా కవిత సమర్పించాల్సి ఉంటుందని సమాచారం.

ఎమ్మెల్సీ కవితకు 91 సీఆర్పీసీ నోటీసులు 

ఆదివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 6.30 ని.ల వరకు దాదాపు ఏడున్నర గంటల పాటు సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించారు. మహిళా అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల సీబీఐ టీం 160 సీఆర్పీసీ కింద కవిత స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఈప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డిండ్ కూడా చేసినట్లు సమాచారం. ఉదయం నుంచి అడ్వకేట్ సమక్షంలో అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం భోజన సమయం తర్వాత సీబీఐ అధికారులు అడ్వకేట్ ను బయటకు పంపి కవితను విడిగా ప్రశ్నించినట్లు సమాచారం.

ఇక 91 సీఆర్పీసీ నోటీస్ అందుకున్న వ్యక్తి తప్పనిసరిగా విచారణ అధికారి ముందు హాజరుకావాల్సి ఉంటుంది. తమ న్యాయ నిపుణులతో జరిగిన భేటీలో 91 సీఆర్పీసీ నోటీసులపైనే కవిత చర్చించారని తెలుస్తోంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన తర్వాత… కవితకు సీబీఐ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. నిందితులైన బోయినపల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు స్టేట్మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.