పాలేరులో షర్మిల పాగా ? 

పాలేరులో షర్మిల పాగా ?

పాలేరులో షర్మిల పాగా ? వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : పాలేరు నియోజకవర్గం. రాష్ట్రంలో ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ కొంతకాలంగా ఈ నియోజకవర్గం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచి పోటీచేసే నేతలు వీరంటే వీరంటూ చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రచారంలో ఉన్న పేర్లన్నీ ప్రముఖులవే కావడంతో పాలేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పాలేరు నియోజకవర్గం నుంచి కందాల ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తుమ్మల నాగేశ్వర్ రెడ్డిపై విజయం సాధించారు. అయితే కొంతకాలానికి ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లోకి జంప్ కొట్టారు. తుమ్మల కూడా ఇక్కడి నుంచే పోటీ చేసిన నేపథ్యంలో ఈసారి ఎవరికి టికెట్ దక్కుతుందా అని జనం చర్చించుకుంటున్నారు. ఎవరికి వారు టికెట్ మాదంటే మాదంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు.

*ఆయనకు ఈ సారి టికెట్ కష్టమే!
కందాల ఉపేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు మధ్య గ్యాప్ అయితే కచ్చితంగా ఉంది. ఇద్దరూ ఒక్క దగ్గర కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదు. పచ్చగడ్డి వేసినా భగ్గుమనే స్థాయిలో వైరం నెలకొంది. అయితే మధ్యలో కొంతకాలం ఉపేందర్ రెడ్డి దూకుడు పెంచినా, తుమ్మల మళ్లీ యాక్టివ్ అయిపోయారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ తో తుమ్మల మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేశారు. దీంతో ఈసారి టికెట్ ఎవరికి దక్కుతుందా అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఉపేందర్ రెడ్డికి ఈసారి బీఆర్ఎస్ టికెట్ రాకపోవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి.

*కేసీఆర్ సన్నిహితుడిగా ముద్ర..
తుమ్మల సీనియర్ నాయకుడు కావడం, అందులోనూ సీఎం కేసీఆర్ సన్నిహితుడిగా ముద్రపడడంతో ఆయనకే టికెట్ వస్తుందని పాలేరు జనం చెప్పుకుంటున్నారు. అన్నింటికి మించి పాలేరులో ఈసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున షర్మిల పేరు బలంగా వినిపిస్తోంది. పాలేరు నుంచి షర్మిల పోటీ చేయడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా షర్మిల టీమ్ పాలేరులో పలు కార్యక్రమాలు చేపడుతోందని టాక్. ఇప్పటికే జనం అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారట. సర్వే కూడా చేయించుకున్నారని సమాచారం. అందులో షర్మిలకు మంచి మార్కులొచ్చాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినా షర్మిలకు పాలేరు సీటు అయితే బెటర్ అని పార్టీ క్యాడర్ కూడా సూచించారట. దీంతో అన్ని ఆలోచించి ఆమె పాలేరులో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

*ద్విముఖ పోరులో గెలిచేదెవరో !
పాలేరులో షర్మిల పోటీ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతున్న తరుణంలో బీఆర్ఎస్ బలమైన అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ అంత బలంగా లేదన్న వాదన ఉంది. ఈ తరుణంలో షర్మిలకు పోటీ ఇవ్వడం బీఆర్ఎస్ తోనే ఖాయమన్న అంచనాలున్నాయి. అందుకే షర్మిలకు పోటీ ఇచ్చేందుకు తుమ్మలను బరిలోకి దింపే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి తుమ్మల కూడా సిద్ధంగా ఉన్నారట. తనకు గులాబీ టికెట్ ఇస్తే, షర్మిలపై పోటీచేయడానికి సిద్ధమని ఆయన సంకేతాలిస్తున్నారు. దీంతో పాలేరులో షర్మిల వర్సెస్ బీఆర్ఎస్ గా రాజకీయం మారింది. ద్విముఖ పోరులో జనం ఎటు వైపు మొగ్గుతారో అర్థం కావడం లేదు.

*ఎవరి ధీమా వారిదే !
పాలేరులో తనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని షర్మిల భావిస్తున్నారు. దీనికి తోడు ఈ నియోజకవర్గంలో ఆమెకు పరిచయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తనకు కలిసొస్తాయని ఆమె అంచనా వేస్తున్నారు. ఇక తుమ్మల కూడా పాలేరులో తాను గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు తనకు కలిసొస్తాయని ఆయన చెబుతున్నారు. ప్రజలు ఎవరికి అండగా నిలుస్తారో కానీ పోటీ మాత్రం గట్టిగానే జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలొచ్చే సరికి పరిస్థితి ఇలాగే ఉంటుందా లేదా అన్నది వేచిచూడాలి.