అక్రిడిటేషన్‌ పాలసీపై ప్రభుత్వానికి నోటీసులు

అక్రిడిటేషన్‌ పాలసీపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాణ మీడియా అక్రిడిటేషన్‌ పాలసీపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రిడిటేషన్‌ కమిటీ, నిబంధనలు, అర్హతలకు సంబంధించి ప్రభుత్వ జీవోను సవాలు చేస్తూ హైటెక్‌ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. డిజిటల్, కేబుల్‌ ఛానళ్లకు అక్రిడిటేషన్‌ల జారీకి నిర్ణయించిన అర్హతలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం అక్రిడిటేషన్‌ల జారీ ప్రక్రియ మొదలైందని, జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరగా.. ఏ ప్రాతిపదికన మార్గదర్శకాలు జారీ చేసిందో తెలుసుకోకుండా స్టే ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. 3 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని సీఎస్, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, సమాచారశాఖ కమిషనర్, మీడియా అకాడమీ ఛైర్మన్‌లకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను మార్చి 12కు వాయిదా వేసింది.