పెండింగ్ ప్రాజెక్టులు..రెండేళ్లలో పూర్తి-రేవంత్ రెడ్డి

పెండింగ్ ప్రాజెక్టులు..రెండేళ్లలో పూర్తి -సీఎం రేవంత్ రెడ్డి

పెండింగ్ ప్రాజెక్టులు..రెండేళ్లలో పూర్తి-రేవంత్ రెడ్డివరంగల్ టైమ్స్,ములుగు జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ రాబోయే రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద ఉన్న జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు సీతక్క,పొంగులేటి శ్రీనివాసరెడ్డి,సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ఎంపీ లు,ఎంఎల్ ఏ లు,నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలసి అక్కడ గోదావరి నదిపై నిర్మించిన బ్యారేజి, దేవాదుల పంప్ హౌస్, ఇంటెక్ వెల్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి, ఆర్థిక పరిస్థితి, భూసేకరణ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.పెండింగ్ ప్రాజెక్టులు..రెండేళ్లలో పూర్తి-రేవంత్ రెడ్డిఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన సాగునీటి పథకమని తెలిపారు. ప్రారంభంలో రూ.6 వేల కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, ప్రస్తుతం రూ.18 వేల కోట్ల వ్యయానికి చేరుకుందని వెల్లడించారు. వ్యయాలు పెరగడానికి ఆలస్యం, పరిపాలనా లోపాలు, సరైన ప్రణాళికాభావమే ప్రధాన కారణాలని పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అంది, ఉత్తర తెలంగాణ రైతులకు పెద్ద మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సాగునీటి వనరుల సమర్థ వినియోగంతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. దేవాదుల పనులపై సీఎం రేవంత్ రెడ్డి గడువు విధించారు. జూన్ 2 లోపు భూసేకరణ పూర్తికి ఆదేశించారు. దేవాదుల ఎత్తిపోతల పథకంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారకూడదని, రైతుల ప్రయోజనాలే పరమావధిగా పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ కోసం ఒక ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పరిహారం చెల్లింపుల కోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.దేవాదుల ప్రాజెక్టులో నిలిచిపోయిన పంప్‌లకు నెల రోజుల్లోపు మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, అధికారులతో దేవాదుల ప్రాజెక్టుపై కమిటీ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.రామప్ప చెరువు నుంచి జంపన్న వాగుకు నీరు అందించే ప్రణాళికపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ జాప్యం కారణంగా ప్రాజెక్టు పనులు ఏమాత్రం ఆగడానికి వీలులేదని, నిధుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలంటే అన్ని సాగునీటి ప్రాజెక్టులను సమగ్రంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలోని పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అందుకోసం సమగ్ర సమీక్ష చేపట్టి, ప్రాధాన్యత క్రమంలో నిధుల కేటాయింపు, భూసేకరణ వేగవంతం, సాంకేతిక అడ్డంకుల పరిష్కారం వంటి అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.