బెంగాల్‌లో బీజేపీకి మరో భారీ షాక్‌

బెంగాల్‌లో బీజేపీకి మరో భారీ షాక్‌

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. బీజేపీ బాగ్డా ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్, పార్టీ కౌన్సిలర్ మనోతోష్ నాథ్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్ టీఎంసీకి పార్టీలో చేరిన 24 గంటల్లోనే మరో ఎమ్మెల్యే అదే బాట పట్టడం విశేషం. బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత కేంద్రంలో బీజేపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా బెంగాల్‌ టీఎంసీ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూసుకుపోతున్న తరుణంలో  ఈ కీలక పరిణామం  చోటు చేసుకుంది.

బీజేపీ సీనియర్లు ముకుల్ రాయ్, తన్మయ్ ఘోష్ తరువాత, ఇప్పుడు మరో బీజేపీ ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్, పార్టీ కౌన్సిలర్ మనోతోష్ నాథ్‌ మంగళవారం కోల్‌కతాలో టీఎంసీ కండువా కప్పుకున్నారు. కొన్ని అపార్థాల కారణంగా గతంలో కొన్ని మార్పులు జరిగాయని కానీ తిరిగి తన ఇంటికి చేరుకున్నానంటూ ఈ సందర్భంగా బిశ్వజిత్‌ సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు తన సేవలు కొనసాగుతాయన్నారు

కాగా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అనూహ్యంగా విజయాన​న్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో టీఎంసీకి ఓటమి తప్పదనే అంచనాలతో టీఎంసీ నుంచి బీజేపీలోకి జంప్‌ చేసిన పలువురు నేతలు తాజాగా  టీఎంసీ బాటపడుతున్నారు. ఇప్పటికే ముకుల్ రాయ్ తోపాటు కొంతమంది సీనియర్‌  నేతలు టీఎంసీ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే.