పూరీకి మద్దతుగా మాత్రమే వచ్చాను : బండ్ల గణేష్

పూరీకి మద్దతుగా మాత్రమే వచ్చాను : బండ్ల గణేష్హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా మంగళవారం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని ఈడీ విచారించింది. ఆయన ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన తదితర అంశాలపై పూరీని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

అయితే పూరీ జగన్నాథ్ తో పాటు బండ్ల గణేష్ కూడా ఈ విచారణ సమయంలో కనిపించడంతో ఆయనకు కూడా డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయా.. అనేలా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై వెంటనే స్పందించిన బండ్ల గణేష్ “దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నాకు ఏ విధమైన సంబంధం లేదు. నేను పూరీ జగన్నాథ్ కి మద్దతుగా మాత్రమే వచ్చాను” అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

అంతకు ముందు మీడియా ఇదే ప్రశ్నను అడుగగా “అమ్మ మీద ఒట్టు నాకేం తెలియదు. పూరి జగన్నాథ్ ను కలవడానికి మాత్రమే వచ్చాను. పూరి నా స్నేహితుడు. ఉదయం ఎప్పుడో వచ్చాడు. ఏం జరిగిందోనని టెన్షన్ గా వుంది అందుకే తెలుసుకోవడానికి వచ్చాను” అని తెలిపాడు. ఈడీ కార్యాలయంలో పూరీతో పాటు పూరి కుమారుడు ఆకాష్ పూరి, సోదరుడు సాయిరాం శంకర్, అడిటర్ సతీష్ ఉన్నారు.