సైబర్ మోసానికి గురైన బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏ చిన్న అవకాశం ఉన్నా సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు. చదువురాని వారే కాదు, చదువుకున్న వాళ్లు అన్న తేడా లేకుండా సైబర్ నేరగాళ్ల చేతివాటంలో బలి అవుతున్నారు. సైబర్ నేరగాళ్ల చేతివాటానికి బలవుతున్న వారిలో ఉద్యోగులు, ప్రముఖులు మాత్రమే కాకుండా డిజిటల్ లావాదేవీల గురించి బాగా అవగాహన ఉన్నవారు కూడా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా సైబర్ నేరగాళ్ల వలలో ఎస్బీఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ మోసపోయాడు. హనుమకొండ జిల్లా పరకాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన మొబైల్ ఫోన్ కు వచ్చిన మెసేజ్ లోని లింకును అసిస్టెంట్ మేనేజర్ సకల్ దేవ్ సింగ్ క్లిక్ చేశాడు. ఇంకేముంది లింక్ ఓపెన్ చేయగానే తన ఖాతా నుంచి ఏకంగా రూ. 2లక్షల 24వేల 967 లను పోగొట్టుకున్నాడు.
అయితే సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సెల్ ఫోన్ కు వచ్చే మెసేజ్ లలో ఏ లింకులు పడితే ఆ లింకులు క్లిక్ చేయకూడదని ఖాతాదారులలో సైబర్ నేరాలపై అవగాహన కల్గించి, అప్రమత్తంగా ఉండాలని సూచించాల్సిన బ్యాంకు అధికారులే ఇలాంటి మోసగాళ్ల చేతిలో మోసపోవడంతో సామాన్య ప్రజలు అవాక్కవుతున్నారు.