వివేక్ కు కలిసొస్తున్న కాలం !
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. పార్టీలు వేరైనా ఇప్పటిదాకా కూన కుటుంబసభ్యులే ఇక్కడ్నుంచి గెలవడం విశేషం. 2009లో గెలిచిన కూన శ్రీశైలం గౌడ్ అయినా 2014,18లో వరుసగా రెండుసార్లు విజయదుందుభి మోగించిన కేపీ వివేకానంద గౌడ్ అయినా ఇద్దరూ కూన ఫ్యామిలీ వాళ్లే. అంతేకాదు ఈసారి కూడా గట్టి పోటీ ఈ ఇద్దరి మధ్యే ఉండడం ఆసక్తికరంగా మారింది.
కేపీ వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంపై ఆయనకు గట్టి పట్టుంది. కొంతకాలంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో గ్యాప్ ఉన్నప్పటికీ మెజార్టీ బీఆర్ఎస్ శ్రేణులు వివేక్ వైపే ఉన్నారు. గులాబీ క్యాడర్ బలంగా ఉండడంతో ఇక్కడ వివేక్ హవా కొనసాగుతోంది. ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరవేయడంలో వివేకానంద చాలా యాక్టివ్ గా ఉన్నారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించినప్పటికీ ఆయనపై అంతగా వ్యతిరేకత లేదనే మాట వినిపిస్తోంది.
కుత్బుల్లాపూర్ లో పారిశ్రామిక కాలనీలు, నివాస సముదాయాలు ఉన్నప్పటికీ అన్నింటిపైనా వివేకానంద పట్టు కొనసాగుతోంది. తనదైన మాటతీరుతో అందరివాడుగా పేరు తెచ్చుకున్నారాయన. పార్టీ హైకమాండ్ దగ్గర కూడా వివేక్ కు మంచి పేరుందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అంతేకాదు ఆ మధ్య మల్లారెడ్డి పదవికి ఎసరొస్తుందన్న ప్రచారం జరిగినప్పపుడు ఆ మినిస్ట్రీ పోస్టు వివేకానంద గౌడ్ కే ఇస్తారన్న గుసగుసలు కూడా వినిపించాయి. ఆ స్థాయిలో ఆయనపై కేటీఆర్ కు నమ్మకముందని టాక్. వివేకానందకు మంచి భవిష్యత్తు ఉంటుందని కేటీఆర్ కూడా భరోసా ఇచ్చినట్లు గులాబీ శ్రేణులు చెబుతున్నారు. అంతేకాదు ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడితే వివేకానంద గౌడ్ మంత్రి కావడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఎమ్మెల్యేగా మంచి జోరు మీదున్న వివేక్.. కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారు. కానీ శంభీపూర్ రాజు కూడా ఈ టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు టాక్. అయితే హైకమాండ్ మాత్రం వివేక్ వైపు మొగ్గు చూపే అవకాశముంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రి కేటీఆర్ కూడా వివేకానంద గౌడ్ కు ఆదిశగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇక కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ కు బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంది. బీజేపీ తరపున కూన శ్రీశైలం గౌడ్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరడంతో ఇప్పటిదాకా ఆయన వెంట నిలిచిన ముస్లిం మైనార్టీలు ఆగ్రహంతో ఉన్నారట. దీంతో ఈసారి ఆ ఓట్లు శ్రీశైలం గౌడ్ కు పడడం కష్టమే. ఈ ఓట్లన్నీ బీఆర్ఎస్ కే పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ కూన శ్రీశైలం గౌడ్ అకస్మాత్తుగా బీజేపీలోకి చేరిపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.
ఈ నేపథ్యంలో హస్తం పార్టీ మళ్లీ దారిలో పడడం కష్టమే. దీంతో వచ్చే అసెంబ్లీ పోటీ బీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత సమీకరణాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆయన హ్యాట్రిక్ కొడతారా? గులాబీ క్యాడర్ ఆశిస్తున్నట్లు హ్యాట్రిక్ తో పాటు మినిస్ట్రీ పోస్టు కూడా వివేక్ సొంతమవుతుందా? లేక కూన శ్రీశైలం గౌడ్ సత్తా చాటుతారా? అన్నది చూడాలి. !!