ఖమ్మంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్!!

ఖమ్మంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్!!

ఖమ్మంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్!!

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలి పొలికేక పెట్టేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. తనదైన స్టైల్ లో భారీ బహిరంగ సభ పెట్టి, క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 18న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ సభ ఆశామాషీగా కాకుండా లక్షలాది మందితో నిర్వహించాలని గులాబీ బాస్ నిర్ణయించారట. 2001లో కరీంనగర్ వేదికగా నిర్వహించిన సింహగర్జన సభ రేంజ్ లో ఉండాలని పార్టీ ముఖ్యులకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.

ఖమ్మం సభకు దేశంలోని అతిరథ మహారథులను తీసుకొచ్చే పనిలో ఉన్నారు సీఎం కేసీఆర్. ముగ్గురు సీఎంలు, యూపీ మాజీ సీఎంతో పాటు పలువురు జాతీయ నేతలు రానున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ రాబోతున్నారు. జాతీయస్థాయిలో కీలకంగా ఉన్న ఈ నేతలందరినీ తీసుకువచ్చి, బీఆర్ఎస్ కు ప్రత్యేక ఆకర్షణ తీసుకురావాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.

నిజానికి సీఎం కేసీఆర్ సభ పెట్టాలంటే పార్టీ బలంగా ఉన్న ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ లేక ఇతర జిల్లాల్లో పెట్టొచ్చు. కానీ బీఆర్ఎస్ తొలి మీటింగ్ కు ఖమ్మంను ఎంచుకోవడం వెనక పక్కా స్ట్రాటజీ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కొంత బలహీనంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. నేను కూడా రేసులో ఉన్నానంటూ షర్మిల వాయిస్ ను పెంచుతున్నారు. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ లో వణుకు పుట్టిస్తున్నారు.

పార్టీలోని ముఖ్యమైన నేతలకు ఆయన గాలమేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ తొలి మీటింగ్ ఇక్కడ నిర్వహించడం ద్వారా ఖమ్మం ప్రజల మూడ్ ను ఛేంజ్ చేసేందుకు గులాబీ బాస్ గట్టిగానే ప్లానేసినట్లు టాక్. ఓ వైపు పొంగులేటికి చెక్ పెట్టడం, మరోవైపు పార్టీ బలాన్నిపెంచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకెళ్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాల నేతలతో సీఎం కేసీఆర్ ఇటీవల మీటింగ్ కూడా నిర్వహించారు. సభను సక్సెస్ చేయడం ద్వారా ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ బలాన్ని మరింత పెంచుకోవాలని సూచించారట. కాబట్టి లక్షలాది మందిని సమీకరించి ఖమ్మం మీటింగ్ ను విజయవంతం చేయాలని సూచించిట్లు టాక్.

ఈనెల 18న ఖమ్మంలో మీటింగ్ పెట్టడంపై బీఆర్ఎస్ నేతలు కూడా హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. ఖమ్మంలో మీటింగ్ పెట్టడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి బలం మరింత పెరుగుతుందని సీఎం కేసీఆర్ తో జిల్లా ముఖ్యనేతలు చెప్పారట. ఎట్టి పరిస్థితుల్లో లక్షలాది మందిని సభకు తీసుకొచ్చి, ఖమ్మం సత్తా చూపిస్తామని కేసీఆర్ తో గట్టిగానే చెప్పినట్లు సమాచారం.

ఖమ్మం మీటింగ్ కు అసలే జాతీయ నేతలు వస్తున్నారు. కాబట్టి తెలంగాణలో గులాబీ పార్టీ జనసమీకరణ అంటే ఎలా ఉంటుందో చాటిచెప్పేలా ఇప్పట్నుంచే పర్ ఫెక్ట్ రూపొందించుకునేపనిలో గులాబీ శ్రేణులున్నారు. మరి ఈ మీటింగ్ తో ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ బలపడుతుందా? లేక పొంగులేటి ఫ్యాక్టర్ ఎక్కువ పనిచేస్తుందా? లేక ఇతర పార్టీలకు జిల్లా ప్రజలు అండగా నిలుస్తారా? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.