కర్ణాటకలో కాంగ్రెస్ హవా!

కర్ణాటకలో కాంగ్రెస్ హవా!

ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
విడుదలైన ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్‌కు 107 నుంచి 119 మధ్య సీట్లు రావచ్చని అంచనా
బీజేపికి 78-90 సీట్లు, జేడీఎస్‌కు 23-29
మళ్లీ ‘హంగ్’తప్పదన్న అంచనాలు

కర్ణాటకలో కాంగ్రెస్ హవా!వరంగల్ టైమ్స్, బెంగళూరు : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కర్ణాటక పోలింగ్‌ ముగిసింది. ఇక ఫలితాలే రావాల్సి ఉంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.రాష్ట్రంలో 65.7 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో 224 నియోజకవర్గాల్లో 2615 మంది హోరాహోరీగా తలపడ్డారు. కర్ణాటకలో మొత్తం 5 కోట్ల 31 లక్షల 33వేల 54 మంది ఓటర్లున్నారు. తొలిసారి ఓటర్లు 11 లక్షల 71వేల 558 మంది ఉన్నారు.

ఈ సారి పోటీ చేస్తున్న వారిలో మహిళల సంఖ్య తక్కువగా ఉంది.బరిలో 16 పార్టీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ లు మధ్యే నెలకొంది. మొత్తం 224 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. 223 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో నిలిపింది. ఒక స్థానంలో సర్వోదయ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. కర్ణాటక వ్యాప్తంగా 58545 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 918 మంది ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నారు. బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేదా కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో ఈ నెల 13 వరకు తేలనుంది.మరోవైపు ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులను కూడా ఎన్నికల సంఘం మోహరించింది. ఏపీ నుంచి 1000 మంది పోలీసులు, 1000 మంది హోంగార్డులు, తెలంగాణ నుంచి 516 మంది పోలీసులు, 684 మంది హోంగార్డులు కర్ణాటక ఎన్నికల విధుల్లో పాలుపంచుకున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో 72 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇదిలా ఉండగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ సంచలనం కలిగిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు 107 నుంచి 119 సీట్లు రావచ్చని తేల్చింది.

బీజేపీకి 78 నుంచి 90 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది.కింగ్ మేకర్ అయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్న జేడీఎస్‌కు 23 నుంచి 29 వరకూ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇతరులకు 1 నుంచి 3 సీట్లు రావచ్చని అంచనా.ఇప్పటివరకూ విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో అధిక శాతం కాంగ్రెస్‌ ముందంజలో ఉంటుందని తేల్చి చెప్పాయి. జనతాదళ్ సెక్యులర్ నేత హెడీ కుమారస్వామి కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం మెండుగా ఉన్నట్టు ఫలితాల్లో తేలింది. మొత్తం 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 113.

– కర్ణాటక ఎగ్జిట్‌పోల్స్ సర్వేలో కాంగ్రెస్ పార్టీదే పైచేయి
పీపుల్స్ పల్స్ : కాంగ్రెస్ 107-119, బీజేపీ 78-90, జేడీఎస్ 23-29, ఇతరులు 1-3

రిపబ్లిక్: కాంగ్రెస్ 94-108-బీజేపీ 85-100, జేడీఎస్ 24-32, ఇతరులు 2-6

శ్రీఆత్మ సాక్షి : కాంగ్రెస్ 117-124-బీజేపీ 83-94, జేడీఎస్ 23-30, ఇతరులు 2-8

జన్‌కీ బాత్ :కాంగ్రెస్ 91-106, బీజేపీ 94-117, జేడీఎస్ 14-24, ఇతరులు 0-4

పొలిటికల్ లేబొరేటరీ : కాంగ్రెస్ 108, బీజేపీ 80, జేడీఎస్ 32, ఇతరులు 4

పోల్ స్టార్ట్ : కాంగ్రెస్ 99-109, బీజేపీ 88-98, జేడీఎస్ 21-26, ఇతరులు 2-4

జీ న్యూస్ : కాంగ్రెస్ 103-118, బీజేపీ 97-94, జేడీఎస్ 22-23, ఇతరులు 3-5

టైమ్స్ నౌ : కాంగ్రెస్ 86, బీజేపీ 114, జేడీఎస్ 21, ఇతరులు 3

పోలింగ్ సందర్భంగా ప్రధాని మోడీ కర్ణాటక ఓటర్లకు బహిరంగ లేఖ రాశారు. ఈ సారి బీజేపీకి అధికారాన్ని ఇవ్వాలని ఆ లేఖలో కర్ణాటక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఇన్నోవేషన్ లో కర్ణాటకను అగ్రస్థానంలో నిలపాలన్నది తమ ఆకాంక్ష అని కన్నడ ఓటర్లకు ప్రధాని తెలిపారు. విద్యా, ఉద్యోగాలు, ఔత్సాహిక పారిశ్రామిక రంగంలోనూ నంబర్ వన్ స్థానంలో కర్ణాటకను నిలుపుతామని అన్నారు.

ఇక కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం కర్ణాటక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మార్పు కోసం కాంగ్రెస్ కే ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఏది ఏమైనా కర్ణాటకలో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్ ను బట్టి చూస్తే కర్ణాటకలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం ఓటర్లపై బాగా ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. పబ్లిక్ పల్స్ ఎగ్జిట్ పోల్ ను చూసి కాంగ్రెస్ కు ఇప్పటికే కొంత బలం చేకూరింది. అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఫలితాలు ఎవరిని అధికారంలోకి దింపుతాయే తెలవాలంటే మే 13 వరకు వేచి చూడాల్సిందే.