దేవ్ జీ సహా లొంగిపోయిన మావో అగ్రనేతలు
-డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేతలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి, అత్యంత సీనియర్ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులు సీసీఎం మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారవు అలియాస్ జగన్, అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్ సీఎం నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ సన్ను దాదా కూడా లొంగిపోయారు. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. గత రెండేళ్లలో నలుగురు సీసీఎంలు, 16 మంది ఎస్ఈఎంలు, 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు, సెక్రటరీలు, 85 మంది ఏసీఎస్ లు, 60 మంది పార్టీ సభ్యులు సహా మొత్తం 591 మంది జన జీవన స్రవంతిలోకి వచ్చారు. తెలంగాణలో పుట్టి, పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్లలో కొంతమంది మాతో చర్చలు జరుపుతున్నారు అని తెలిపారు. త్వరలోనే వారు కూడా బయటకు వస్తారన్నారు.
పోలీసుల అమరవీరుల సంస్మరణ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఎంతో మంది మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి జన జీవన స్రవంతిలోకి వస్తున్నారు. అలా వచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు, పునరావాస ప్రయోజనాలు వెంటనే అందిస్తామని తెలిపారు.మావోయిస్టుల లొంగుబాటులో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ ఇంటలిజెన్స్ ఐజీ సుమతి, ఆమె టీంను డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు. ఐడీజీ ఇంటలిజెన్స్ విజయ్ కుమార్ ను కూడా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డిల స్వస్థలం, విద్యాభ్యాసం, మావోయిస్టులుగా వారి జీవన ప్రయాణాన్ని ఈ సందర్భంగా డీజీపీ వివరించారు. జన జీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టుల హక్కుల కాపాడేందుకు ప్రయత్నిస్తామని, అవసరమైతే వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు పెడతామని డీజీపీ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా దేవ్‌జీ మాట్లాడుతూ “అనారోగ్య కారణాలతో రహస్య జీవితాన్ని వదిలివేయాలని నిర్ణయించుకున్నాను, నేను నమ్మిన సిద్ధాంతాన్ని కొనసాగిస్తాను. ప్రజల సమస్యలపై ఇకపై కూడా పోరాడతాము. అనవసర చర్చలకు, అపోహలకు దారి తీసే సమయం కాదిది. మీ ప్రశ్నలు అన్నింటికి సమాధానం తర్వాత మీడియాకు, ఇంటర్వ్యూల ద్వారా తెలుపుతా. రాజకీయ జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను” అని అన్నారు. రాజిరెడ్డి మాట్లాడుతూ “ప్రజల కోసం పనిచేస్తాం. చట్ట పరిధిలో పనిచేస్తాం. ప్రజలు వెనక పనిచేస్తాం. మావోయిజం ముగింపు దశలో లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉంది. మేము లొంగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రభుత్వంతో చర్చించి మిగిలిన మావోయిస్టులకు ఏం సందేశం ఇవ్వాలనేది ఆలోచిస్తాం”అని తెలిపారు.














