ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్
వరంగల్ టైమ్స్ , అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు సంబంధించిన ఉపఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శుక్రవారం విడుదల చేశారు. 5 మండల పరిషత్ లతో పాటు 26 పంచాయతీల్లో ఉప సర్పంచ్ ల ఎన్నికకు కూడా నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆయా మండల పరిషత్ , గ్రామ పంచాయతీల్లో వచ్చే నెల 5న ఎన్నిక జరుగనున్నట్లు పేర్కొన్నారు. విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు చెందిన నరసాపురం, పెదకూరపాడు, ఉంగుటూరు, పొదలకూరు మండల పరిషత్ లకు సంబంధించి మండల పరిషత్ అధ్యక్షులతో పాటు మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. కోనసీమ జిల్లాకు చెందిన రాయవరం మండల పరిషత్ కు సంబంధించి ఉపాధ్యక్ష పదవికి కూడా ఎన్నిక జరుగనుంది. అదే మాదిరిగా 26 పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా మే 5 నే జరుగనున్నాయి.