‘ ఐ లవ్ యూ’ వివేక్
-ముగిసిన బాల్క సుమన్ రిమాండ్
-బాల్క సుమన్ విడుదలతో జిల్లాలో హైటెన్షన్
-చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలి
-వివేక్ తనని చంపుతారేమోనని అనుమానంగా ఉంది
-విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్

వరంగల్ టైమ్స్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా కలెక్టర్, డీసీపీ, సీఐ, ఎస్సైలు సహా రెవెన్యూ అధికారులు మంత్రి వివేక్ వెంకటస్వామి విశాఖ కంపెనీ ఉద్యోగులుగా మారిపోయారని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను ఇప్పటికైనా పాటించి క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. 14 రోజుల రిమాండ్ అనంతరం బుధవారం విడుదలయ్యారు. జైలు నుంచి బయటికి వచ్చిన బాల్క సుమన్ కు మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో వచ్చి పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. దీంతో జైలు పరిసరాల్లో పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇక జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్ ఇంటికి చేరుకున్నాక, తన ఇంటిలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో మంత్రి వివేక్ పై, జిల్లా పోలీసు, అధికార యంత్రాంగం తీరుపై మండిపడ్డారు. క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో సంపూర్ణ ఆధిక్యత కల్గిన బీఆర్ఎస్ కు పాలకవర్గం పగ్గాలు దక్కకుండా మంత్రి వివేక్ సూచనలకు అనుగుణంగా మంచిర్యాల జిల్లా అధికార యంత్రాంగం మొత్తం సహకరించిందని సుమన్ మండిపడ్డారు. మా కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి మున్సిపాలిటీని దక్కించుకోవాలని చూశారన్నారు. నేనుంటే అది సాధ్యం కాలేదని నన్ను జైల్లో క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్ పదవి వశపరుచుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి చూశారన్నారు. అయినా కూడా మా కార్యకర్తలు బలంగా, మొండిగా నిలబడ్డారని చెప్పారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ లు ప్రజాతీర్పును గౌరవించి అర్థం చేసుకోవాలని కోరుతున్నా అని అన్నారు.
రాజకీయాల్లో వివిధ పార్టీల్లో వ్యక్తులు ఉండటం సహజం, రాజకీయ వైరుధ్యాలుగానే చూడాలి తప్ప వ్యక్తిగతంగా చూడకూడదన్నారు. నేను ఎప్పుడూ ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వాలు పెట్టుకోలేదన్నారు. కానీ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను శత్రువులుగా చూస్తున్నారని, తాను పదేళ్లలో ఒక్కరిని కూడా జైలుకు పంపలేదని బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, జైలు నుంచి బయటకు రాకుండా అనేక కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చిన్న కొడుకు పుట్టిన రోజు ఉన్నందున తనను జైలు నుంచి బయటకు రాకుండా వేర్వేరు కేసులను తెరపైకి తెచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
హోలీ రోజు తన కుటుంబం కార్యకర్తలతో కలిసి గడపకుండా ఉండేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. సీసీ ఫుటేజ్ ను రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ, తనను వేధించిన మంత్రి వివేక్ ను ప్రేమిస్తూనే ఉంటానని, ఐ లవ్ యూ వివేక్ అంటూ బాల్క సుమన్ చమత్కించారు. వివేక్ తనని చంపుతారేమోనని అనుమానంగా ఉందని విలేకరుల సమావేశం ద్వారా వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ఉన్నవారికే చైర్మన్ పదవి దక్కాలని, క్యాతనపల్లిలో 22 వార్డుల్లో 14 వార్డులు బీఆర్ఎస్ సీపీఐ గెలిచినప్పటికీ, 8 వార్డులు గెలిచిన కాంగ్రెస్ చైర్మన్ పదవిని ఎలా పొందుతుందని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, డీసీపీ ప్రభుత్వానికి కాక ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వ్యవహరించి చైర్మన్ ఎన్నికను వెంటనే నిర్వహించాలని బాల్క సుమన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 17న చోటు చేసుకున్న ఘర్షణ, రాళ్ల దాడి ఘటనలో బాల్క సుమన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అరెస్ట్ అయిన బాల్క సుమన్ కు కోర్టు రిమాండ్ విధించడంతో ఫిబ్రవరి 18న పోలీసులు ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. రిమాండ్ గడువు ముగియడంతో పాటు మంచిర్యాల కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన జైలు నుంచి బయటికి వచ్చారు.














