కేసీఆర్ తో జనసేనాని దోస్తానా !!
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : ఓవైపు ఏపీలో హాట్ డైలాగులతో రాజకీయాన్ని వేడెక్కించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణకు వచ్చేసరికి మాత్రం సైలెంట్ అయిపోయారు. సీఎం కేసీఆర్ పై పవన్ ఏం మాట్లాడుతారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ జనసేనాని మాత్రం పరోక్షంగా కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ పై ప్రేమను మరోసారి చాటుకున్నారు.
* కేసీఆర్ కు ప్రశంసలు.. జగన్ కు విమర్శలు
తన ప్రచారరథం వారాహికి పూజలు చేసేందుకు కొండగట్టుకు విచ్చేసిన జనసేనాని తన ప్రసంగంలో ఎక్కడా తెలంగాణ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఏపీలో కులాల గీతల మధ్య రాజకీయం చేయాల్సి వస్తోందన్న పవన్, తెలంగాణలో ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల్లో సమస్యలు వేర్వేరుగా ఉన్నాయని, ఆంధ్రాతో తెలంగాణను పోల్చి చూడలేమన్నారు. ఏపీలో సొంత బాబాయిని చంపించుకున్న వాళ్లు రాజకీయంలో ఉన్నారని పవన్ విమర్శించారు. తెలంగాణలో అలాంటి నాయకత్వం లేదని చెప్పుకొచ్చారు.
*తెలంగాణలో స్నేహపూర్వక పోటీకి సిద్ధమవుతారా
పవన్ కల్యాణ్ మాటలతో ఒక్క క్లారిటీ అయితే వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణను ఆయన అంతగా సీరియస్ గా తీసుకోకపోవచ్చు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పై జనసేనాని విమర్శలు చేసే అవకాశం కూడా లేకపోవచ్చు. అంటే కేసీఆర్ తో స్నేహపూర్వక పోటీకే జనసేనాని సిద్ధంగా ఉన్నారని అర్థమైపోయింది. జనసేనాని మాటలను బట్టి చూస్తే తెలంగాణలో జనసేన కొన్ని స్థానాల్లోనే పోటీ చేస్తుంది. ఇక ప్రచారంలోనూ పవన్ సీరియస్ గా పాల్గొనకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఉనికిని కాపాడుకోవడానికే జనసేన అక్కడక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు పార్టీ శ్రేణులు ఒత్తిడి తెచ్చేచోట మాత్రమే జనసేన పోటీ చేయొచ్చని అంచనా. ఎమ్మెల్యే ఎన్నికలయినా, ఎంపీ ఎన్నికలయినా తెలంగాణలో మాత్రం జనసేనాని స్ట్రాటజీ మాత్రం ఇదేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
పవన్ కల్యాణ్ మాటలను విశ్లేషిస్తే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత లేదని చెప్పకనే చెప్పారు. అంటే పరోక్షంగా సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు జనసేనకు 10 మంది ఎమ్మెల్యేలుండాలని చెప్పుకొచ్చారు. రాజకీయంలో ఉండే వాళ్లెవరైనా అధికారాన్ని కోరుకుంటారు. సీఎం అవ్వాలనుకుంటారు. లేదా పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించాలని చెబుతారు. కానీ జనసేనాని స్ట్రాటజీ మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఆయన తెలంగాణలో అధికారాన్ని కోరుకోవడం లేదు. 10 మంది ఎమ్మెల్యేలు అయితే చాలట. అంటే ఇది కూడా కచ్చితంగా ఉనికిని చాటుకునే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదంటున్నారు విశ్లేషకులు.
*ఏపీ పాలిటిక్సే టార్గెట్ గా ..
పవన్ కల్యాణ్ ఏపీలో మాటల తూటాలు పేల్చుతూ, తెలంగాణకు వచ్చేసరికి చాలా పద్ధతిగా మాట్లాడడంతో ఒక్కటి మాత్రం స్పష్టమైపోయింది. తెలంగాణ కంటే ఏపీ రాజకీయాలనే ఆయన సీరియస్ గా తీసుకుంటున్నారని అర్థమైపోయింది. అయితే ఒక్కఅంశంలో ఆయన మాటలపై జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీతో సహా ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధమంటున్నారాయన. అదే సమయంలో కేసీఆర్ సర్కారుపై పరోక్షంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
కేసీఆర్ ఏలాగూ పవన్ తో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. జనసేనకు బీజేపీ జత కలిసే అవకాశాలే ఎక్కువ. ఇలా ఒకే సమయంలో భిన్నమైన పార్టీలతో అంటే బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరితోనూ పవన్ దోస్తీ ఎట్లా కుదురుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది ఎలా సాధ్యమో? జనసేనానికే తెలియాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.