జహీరాబాద్ ఎంపీకి కష్టకాలం!!

జహీరాబాద్ ఎంపీకి కష్టకాలం!!

జహీరాబాద్ ఎంపీకి కష్టకాలం!!

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున అతికష్టం మీద గెలిచారు.బొటాబొటీ మెజార్టీతో గట్కెక్కారు. కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు గెలిచినంత పని చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీబీ పాటిల్ అభ్యర్థిత్వంపై గుస్సాగా ఉన్నారని, అందుకే ఆయనకు వాళ్లు సహకరించలేదని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పటి నుంచి ఆ గ్యాప్ అలాగే కొనసాగుతోందట.ఈ మధ్య అయితే బీబీ పాటిల్ కు ఎమ్మెల్యేలకు అస్సలు పడడం లేదని ప్రచారం జరుగుతోంది.

జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.ఈ పార్లమెంటు సెగ్మెంట్ లోకి జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నారాయణ్ ఖేడ్, ఆందోల్, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినప్పటికీ వీళ్లలో ఎవ్వరితోనూ ఎంపీ బీబీ పాటిల్ కు పొసగడం లేదని టాక్. అందుకే మంత్రుల పర్యటనలో తప్ప ఎంపీ బీబీ పాటిల్ కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది.

బీబీ పాటిల్ స్వతహాగా బడా వ్యాపారవేత్త. ఆర్థికంగానూ బలమైన నాయకుడు. దీనికితోడు ఎంపీ కావడంతో ఎంతసేపు తన సొంత వ్యాపారాలపైనే ఆయన దృష్టి పెడతారన్న విమర్శలున్నాయి.జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధిని ఆయన అంతగా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పెద్దలతో పాటు మంత్రి హరీశ్ రావుకు కంప్లయింట్ చేశారట. అంతేకాదు ఆయన తీరు మారదని, వచ్చే ఎన్నికల్లో వేరే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని కూడా కోరినట్లు సమాచారం.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం ఆ నోట ఈ నోట ఎంపీ బీబీ పాటిల్ దృష్టికి వచ్చిందని టాక్. అంతేకాదు మంత్రి హరీశ్ రావు..బీబీ పాటిల్ ను పద్ధతి మార్చుకోవాలని కూడా హెచ్చరించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.తనపైనే ఎమ్మెల్యేలు కంప్లయింట్ చేయడంతో బీబీ పాటిల్ కు కోపం వచ్చిందట. అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీబీ పాటిల్ పావులు కదుపుతున్నట్లు టాక్. అందులో భాగంగానే జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ద్వితీయశ్రేణి నాయకులను ఎంపీగారు ప్రోత్సహిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆయా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో పాటిల్ మాట్లాడడం లేదట కానీ సెకండ్ గ్రేడ్ నాయకులతో మాత్రం ప్రతిరోజూ టచ్ లో ఉంటున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. అందుకే ఇక లాభం లేదని బీబీ పాటిల్ తో తాడో పేడో తేల్చుకునేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారట. ముఖ్యంగా ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి,మాణిక్ రావు, క్రాంతి కిరణ్ , పాటిల్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

బీబీ పాటిల్ కు ఎమ్మెల్యేలకు గ్యాప్ వచ్చిందన్న విషయం బీఆర్ఎస్ హైకమాండ్ గుర్తించినట్లు టాక్. మంత్రి హరీశ్ రావు ఈ విషయంపై ఎమ్మెల్యేలతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే బీబీ పాటిల్ కు ఈసారి జహీరాబాద్ బీఆర్ఎస్ సీటు రాకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెరపైకి కొత్త అభ్యర్థి రావొచ్చని బీఆర్ఎస్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు కూడా బీబీ పాటిల్ మార్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంచనా వేస్తున్నారు.ఏం జరుగుతుందో చూడాలి మరి ?