ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీల టెన్షన్! 

ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీల టెన్షన్!

ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీల టెన్షన్! 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి: ఎన్నికల ముంగిట కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు వణికిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేల టికెట్లకే ఎసరు పెట్టేలా చేస్తున్నారు. టికెట్ తమదేనంటూ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.దీంతో ఎమ్మెల్సీలంటేనే కొందరు ఎమ్మెల్యేలకు వణుకు పుడుతోందట.

**ఎవరి ధీమా వారిదే..

*తాటికొండ రాజయ్య v/s కడియం శ్రీహరి
ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీల వార్ లో మొదట చెప్పుకోవాల్సింది స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య-ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గురించే. ఇద్దరిలో ఎవరికి వారు తమదే టికెట్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయని రాజయ్య చెబుతుంటే, సీఎం కేసీఆర్ ఈసారి టికెట్ ఇచ్చేది తనకేనంటూ ఎమ్మెల్సీ కడియం చెబుతున్నారు. అంతేకాదు ఇద్దరూ ఒకరిపై ఒకరు డైలాగులు పేల్చుతూ స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాన్ని వేడెక్కించారు. ఈ రాజకీయ వేడితో రెండు వర్గాలకు చెందిన అనుచరులైతే తలపట్టుకుంటున్నారు.

* పైలట్ రోహిత్ v/s పట్నం మహేందర్ రెడ్డి
తాండూరులోనూ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ వార్ హాట్ హాట్ గా జరుగుతోంది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నేపథ్యంలో తన ఇమేజ్ బాగా పెరిగిందని, టికెట్ తనకే ఇస్తారని పైలట్ ధీమాగా ఉన్నారు. అయితే మహేందర్ రెడ్డి మాత్రం అనుభవం ఉన్న తనకే అధిష్టానం టికెట్ ఇస్తుందని చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షాల కంటే ఎక్కువగా పైలట్ పై మహేందర్ రెడ్డి మాటల దాడి చేస్తున్నారు. రెండు వర్గాల మధ్య వార్ ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

*మర్రి జనార్థన్ రెడ్డి v/s దామోదర్ రెడ్డి
నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి,ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి అస్సలు పడడం లేదు. ఎమ్మెల్యే మర్రి జనార్థర్ రెడ్డి వరుసగా రెండుసార్లు గెలిచి జోరు మీదున్నారు. హైకమాండ్ మరోసారి టికెట్ ఇచ్చేది తనకేనంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు దామోదర్ రెడ్డి మాత్రం టికెట్ తనదే, గెలుపు కూడా తనదేనంటూ లెక్కలు వేసుకుంటున్నారు. అంతేకాదు మర్రి జనార్థన్ రెడ్డి వచ్చే కార్యక్రమాలకు సైతం ఎమ్మెల్సీ హాజరు కావడం లేదట. పార్టీ కార్యక్రమాలకు కూడా దామోదర్ రెడ్డి దూరంగా ఉంటున్నారన్న వాదన ఉంది.

*జైపాల్ యాదవ్ v/s కసిరెడ్డి నారయణరెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్,ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని టాక్.సామాజికవర్గపరంగా తనకే టికెట్ వస్తుందని జైపాల్ యాదవ్ కుండబద్దలు కొడుతుండగా, ఎమ్మెల్సీ కసిరెడ్డి మాత్రం కల్వకుర్తిలో గులాబీ టికెట్ తనదేనంటున్నారు. టికెట్ పై తనకు ఎప్పుడో హామీ వచ్చేసిందని కసిరెడ్డి తన అనుచరులతో చెప్పుకుంటున్నారట.

*నోముల భగత్ యాదవ్ v/s కోటిరెడ్డి
నాగార్జున సాగర్ లోనూ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు.ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్,ఎమ్మెల్సీ కోటిరెడ్డి మధ్య ఇంటర్నల్ వార్ తారాస్థాయికి చేరిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సాగర్ తన అడ్డా అని నోముల భగత్ చెబుతుంటే, కోటిరెడ్డి కూడా తగ్గేదేలే అంటున్నారు. ఎవరేం చేసినా ఈసారి టికెట్ వచ్చేది తనకేనంటున్నారు కోటిరెడ్డి. ఆయనకు అంత సీన్ లేదని నోముల భగత్ స్పష్టం చేస్తున్నారు.

*వివేక్ v/s శంభీపూర్ రాజు
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కూడా కొంతకాలంగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తన పనితీరే గీటురాయిగా టికెట్ వస్తుందని ఎమ్మెల్యే వివేక్ కొండంత ఆశతో ఉన్నారు. అయితే శంభీపూర్ రాజు మాత్రం మంత్రి కేటీఆర్ ఆశీస్సులు తనకే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.

ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు టెన్షన్ పెడుతున్నారు.ఈసారి గులాబీ టికెట్ సాధించి ఎమ్మెల్యేలకు చెక్ పెడతామంటున్నారు. సిట్టింగులకే టికెట్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్ మాటలనే ఎమ్మెల్యేలు ఉదహరిస్తుంటే, ఎమ్మెల్సీలు మాత్రం అదేం లేదని తేల్చిచెబుతున్నారు. అధిష్టానం కొందరు ఎమ్మెల్యేలను మార్చడం ఖాయమని, అలా తమకు టికెట్ వస్తుందని ఎమ్మెల్సీలు బల్లగుద్ది చెబుతున్నారు. మరి హైకమాండ్ టికెట్ ఎవరికి ఇస్తుందో? కానీ ఎవరికి ఇచ్చినా, మరోవర్గం సైలెంట్ గా అధిష్టానానికి కట్టుబడి ఉంటుందా అన్నది అనుమానమే.!!