ఆ ఈవెంట్స్ నుంచి గర్భిణులకు మినహాయింపు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫిజికల్ ఈవెంట్స్ నుంచి గర్భిణులకు మినహాయింపు ఇచ్చారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిలో పలువురు గర్భిణులు ఉండటంతో ఫిజికల్ ఈవెంట్స్ కు హాజరుకాలేకపోతున్నారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని, ఫిజికల్ ఈవెంట్స్ లో పాల్గొనకుండానే మెయిన్స్ రాసేలా వెసులుబాటు కల్పించారు.మెయిన్స్ లో ఒక వేళ పాసైతే, నెల రోజుల్లోపు ఫిజికల్ ఈవెంట్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అధికారుల నియమావళిని అంగీకరిస్తూ గర్భిణులు లేఖ రాసివ్వాలని నిబంధన విధించారు.