ఐనవోలును ఆదర్శంగా తీర్చిదిద్దాలి : ఎర్రబెల్లి

ఐనవోలును ఆదర్శంగా తీర్చిదిద్దాలి : ఎర్రబెల్లిహనుమకొండ జిల్లా : ఐనవోలు మల్లికార్జున స్వామి కొలువుదీరిన ఐనవోలు మండలాన్ని ఆదర్శమండలంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ‌లోని ప‌లు అంశాల‌పై వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి దయాకర్ రావు చ‌ర్చించారు.

పెండింగ్ అంశాలు, న‌డుస్తున్న ప‌నులు, ఆయా ప‌నుల్లో వేగం పెంచి పనులు పూర్తి చేయాల‌నే ప‌లు అంశాల‌ను మంత్రి అధికారుల‌తో చ‌ర్చించారు. ఆయా అధికారులను పర్యవేక్షించాల‌ని ఆదేశించారు. నియోజకవర్గ మొత్తం లో 49 కోట్ల 62 లక్షల విలువైన పలు రోడ్లు మంజూరు ఐనట్లు మంత్రి తెలిపారు. ఐనవోలు మండలానికి మంజూరైన రూ. 3కోట్ల 88 లక్షలతో 52 ఈజిఎస్ పనులను వేగవంతం చేసి ఇంకా ఐనవోలు మండలానికి ఎక్కువ నిధులను మంజూరు చేయడానికి నా వంతు కృషి చేస్తానన్నారు.

ఐనవోలు మండలంలో మంజూరైన ఈజీఎస్ పనులు నెల రోజుల్లో పనులు పూర్తి చేసుకోవాలని ఆయా గ్రామాల సర్పంచులను ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డీసీసీ బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్ రావు , జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గజ్జల రాములు, ఎమ్మార్వో రాజేష్, ఎంపీడీఓ వెంకట రమణ, పంచాయతీరాజ్ డీఈ దయాకర చారి, మిషన్ భగీరథ డీఈ జీవన్, ఆర్&బి డీఈ సురేష్, ఇరిగేషన్ డీఈ శారద, ఆర్ డబ్ల్యుఎస్ ఏఈ రవికుమార్, మరియు ఇతర అధికారులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.