శాంతియుత ఉద్యమాలకు స్ఫూర్తి దీక్షా దివస్: ఎర్రబెల్లి

శాంతియుత ఉద్యమాలకు స్ఫూర్తి దీక్షా దివస్: ఎర్రబెల్లిహైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29, 2009 న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పిందని, చరిత్ర గతినే మార్చి వేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అప్పటిదాకా నడుస్తున్న శాంతియుత ఉద్యమానికి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఒక సత్యాగ్రహ ఆయుధంలా మారిందన్నారు.

మొత్తం ప్రజలని ఏకం చేసి, ఆనాటి కేంద్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిన ఆనాటి కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజుని దీక్షా దివస్ గా జరుపుకోవడం, ఉద్యమ నేత త్యాగ నిరతిని గుర్తు చేసుకోవడమే అన్నారు.

నేటికీ దీక్షా దివస్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తే ఒళ్ళు పులకరిస్తుంది అన్నారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను కూడా మరువలేమని మంత్రి అన్నారు.

తెలంగాణ సాధించిన ఉద్యమనేత కేసీఆర్ సీఎంగా తెలంగాణను అదే ఉద్యమ స్ఫూర్తి తో బంగారు తెలంగాణ చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని అద్భుతమైన ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ త్యాగ నిరతికి ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అంత గొప్ప మహా మనిషి మనకు సీఎంగా ఉండటం యావత్ తెలంగాణ ప్రజల అదృష్టమని మంత్రి పేర్కొన్నారు.