బీజేపీ వ్యతిరేక విధానాలను భోగిమంటలో కాల్చేద్ధాం: ఎర్రబెల్లి

బీజేపీ వ్యతిరేక విధానాలను భోగిమంటలో కాల్చేద్ధాం: ఎర్రబెల్లిహైదరాబాద్ : వ్య‌వ‌సాయాన్ని పండుగ చేసి, రైతును రాజును చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌జా, రైతు వ్య‌తిరేక విధానాల‌ను భోగి మంట‌ల్లో కాల్చేద్దామని మంత్రి దయాకర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న ప్ర‌జామోద, ప్ర‌జోప‌యోగ ప‌థ‌కాల‌తోపాటు, రైతు అనుకూల‌, రైతుల‌కు మేలు చేసే రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ వంటి ప‌థ‌కాల ద్వారా నిజ‌మైన సంక్రాంతి వ‌చ్చింద‌ని అన్నారు. భోగి, సంక్రాంతి, క‌నుమ పండుగ‌ల సంద‌ర్భంగా మంత్రి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యే నాటికి దండుగ‌గా మారి, రైతంటే పిల్ల‌ను ఇవ్వ‌డానికి కూడా ముందుకు రాని ప‌రిస్థితి నుంచి, పంట‌ల పెట్టుబ‌డిగా రైతు బంధుని ప్ర‌తీ ఏటా ఎక‌రాకు 10వేల చొప్పున ఇస్తూ, సాగునీరందిస్తూ, 24 గంట‌ల‌పాటు కోత‌లు లేని, నాణ్య‌మైన ఉచిత విద్యుత్‌ని అందిస్తూ, రైతుల రుణాల‌ను మాఫీ చేస్తూ, రైతుల‌కు ప్ర‌భుత్వ‌మే బీమా చేస్తూ, చివ‌ర‌కు పంట‌ల‌ను కూడా కొనుగోలు చేసిన ప్ర‌భుత్వం, సీఎం దేశంలోనే కాదు చ‌రిత్ర‌లో లేర‌న్నారు.

65ల‌క్ష‌ల మంది రైతుల‌కు 50వేల కోట్ల రైతు బంధు, 70వేల మంది రైతు కుటుంబాల‌కు 3,500 కోట్ల బీమా క్లెయిమ్ లు, రైతాంగానికి ఉచిత విద్యుత్ కింద ఏటా 10వేల కోట్లు, పంట‌ల కొనుగోలు కోసం 30వేల కోట్లు వెచ్చిస్తున్న ఏకైక ప్ర‌భుత్వం తెలంగాణ అని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు.

సాగు విస్తీర్ణాన్ని 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెంచి, వ్యవసాయం, వ్య‌వ‌సాయ అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల‌పై 2ల‌క్ష‌ల 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఏకైక సీఎం కేసిఆర్ అన్నారు. సిఎం కెసిఆర్ హ‌యాంలోనే రైతాంగానికి అస‌లైన సంక్రాంతి పండుగ వ‌చ్చింద‌ని తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక‌, రైతు వ్య‌తిరేక విధానాల‌ను, గత రెండేళ్లుగా ప్రజలను ఇబ్బందులు పెడుతున్న క‌రోనా వైర‌స్ లను, వాటి ద్వారా క‌లుగుతున్న క‌ష్టాల‌ను భోగి మంటలలో అగ్ని దేవుడికి ఆహుతి చేయాల‌న్నారు. రాబోయే కాలంలో ప్ర‌జ‌లు శాంతి సౌఖ్యాల‌తో, ఆయు ఆరోగ్యాల‌తో ఉండాల‌ని మంత్రి ఆకాంక్షించారు.