వైకుంఠ ద్వార దర్శనానికి ముమ్మర ఏర్పాట్లు

తిరుమల తరహాలో తుమ్మలగుంటలో వైకుంఠ ఏకాదశి
నేటి అర్థరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనం

వైకుంఠ ద్వార దర్శనానికి ముమ్మర ఏర్పాట్లు

వరంగల్ టైమ్స్, తిరుపతి : తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో తిరుమల తరహాలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా పుష్పాలంకరణ లు, సింగపూర్ నుంచి తెప్పించిన మ్యాట్ లు ఏర్పాటు చేయనున్నారు. దేశ విదేశాల నుంచి 108 రకాల ఆందమైన పుష్పాలు ఏడు వేల కిలోలు తెప్పించారు.

కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలు, ఆహ్వానం పలికే పలు రకరకాల పండ్లు, పచ్చని పందిళ్లు, వేలాదిగా తరలి వచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు తుమ్మలగుంట ఆలయం ముస్తాబవుతోంది. విశేష అలంకరణలో తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయం వైకుంఠ శోభతో అలరారుతోంది. తిరుమల తరహాలో గత 13 ఏళ్లుగా తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయంలో వైకుంఠ ద్వారం దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లా నలుమూలల నుంచి..వైకుంఠ ఏకాదశి సందర్భంగా తుమ్మల గుంట గ్రామంతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలి రానున్నారు. గ్రామం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలుగు తల్లి విగ్రహం వద్ద ఎల్‌ఈడీ బల్బులతో ఏర్పాటు చేసిన దశావతారుల ప్రతిమ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆగమ శాస్త్రోక్తంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయంలో వైకుంఠ ద్వారంను ఏర్పాటు చేస్తున్నారు.

గురువారం అర్థరాత్రి నుంచే భక్తులకు వైకుంఠ ద్వారం ప్రవేశం కల్పించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యేఈ ఏడాది కరోనా ఆంక్షల నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత రీత్యా సామాజిక దూరం పాటించేలా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త , చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

బుధవారం ఏర్పాట్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఆలయం వద్ద తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో సమీక్షించారు. క్యూలైన్ల ఏర్పాటు, భక్తుల నియంత్రణ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నల్లందుల సుబ్బరామిరెడ్డి, అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.