తొలి విడతలో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనుమతులు ఇవ్వాలని సీఎం అసెంబ్లీలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ఆయా శాఖల అధికారులతో పలు దఫాలుగా చర్చించారు. మొత్తం 80,039 పోస్టులకు గాను మొదటి విడత 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నేడు అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదలయ్యాయి.గ్రూప్ 1, హోంశాఖ, జైళ్లు, రవాణాశాఖలు, వైద్య, ఆరోగ్యశాఖల్లోని పోస్టులతో పాటు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్) నిర్వహణకు సైతం ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సంబంధిత శాఖల్లో భర్తీ ప్రక్రియను నియామక సంస్థలు చేపట్టనున్నాయి. టీఎస్పీఎస్పీ ద్వారా 503 గ్రూప్ 1 పోస్టులు, పోలీస్ నియామక సంస్థ ద్వారా జైళ్ల శాఖలో 154 పోస్టులు, పోలీస్ శాఖలో 16,587 పోస్టులు, రవాణా శాఖలో 63 పోస్టులను పోలీస్ శాఖ ద్వారా , టీఎస్పీఎస్పీ ద్వారా జైళ్ల శాఖలో 31 జూనియర్ అసిస్టెంట్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. అలాగే టీఎస్పీఎస్పీ ద్వారా వైద్యారోగ్యశాఖలో 2,662, రవాణాశాఖలో టీఎస్పీఎస్పీ ద్వారా 149, మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూమ్మెంట్ బోర్డు ద్వారా 10,028 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది.