హనుమకొండ జిల్లా : సీఎం కేసీఆర్ పై అస్సా సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేసీఆర్ పాలనాతీరును దుయ్యబట్టారు. 317 జీవోకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే హనుమకొండ జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో నగరంలోని విష్ణుప్రియ గార్డెన్ ఎదురుగా 317 జీవోకు వ్యతిరేకంగా నిరసన బహిరంగ సభ నిర్వహించారు.
ఈ బహిరంగ సభలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ముఖ్యఅథితిగా పాల్గొని మాట్లాడారు. హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటెల గెలుపుతో కేసీఆర్ మైండ్ పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. అస్సాంలో తాము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని తెలంగాణలో నెరవేర్చలేదని ఆరోపించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ నిజాం, ఓరంగజేబు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ కు పోలీసులు తప్ప, ఎవ్వరూ సపోర్ట్ లేరని విమర్శించారు. కొడుకు కేటీఆర్, మనవడు హిమాన్షును సీఎం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు చేసినట్లే తెలంగాణలో నిజాం, నయా నిజాం అసదుద్దీన్ ఓవైసీ వారసత్వానికి బీజేపీ చరమగీతం పాడుతుందని ఢంకా భజాయించి చెప్పారు.
ఈ బహిరంగ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితర నేతలతో కలిసి వేదిక నుంచి మాట్లాడిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కేసీఆర్- అసదుద్దీన్ ఓవైసీల పొత్తు రాజకీయాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్టికల్ 370 ముగిసినట్లే, రామమందిర నిర్మాణం ప్రారంభమైనట్లే, నవ తెలంగాణ నిర్మాణం కోసం నిజాం వారసత్వాన్ని, ఓవైసీ వారసత్వాన్ని వదిలించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అస్సాం సీఎం అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఆరిపోయే దీపమని, తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, హుజురాబాద్ పరిస్థితే తెలంగాణ అంతటా పునరావృతం అవుతుందని ఈటల అన్నారు. రాజకీయ నాయకులనే కాదు, మీడియాపై కూడా కేసీఆర్ జులుం ప్రదర్శిస్తున్నారని, రానున్న రోజుల్లో కేసీఆర్ సర్కార్ కు ప్రజలు ఘోరీ కట్టడం ఖాయమని ఈటల మండిపడ్డారు.
అరెస్ట్ లు, జైళ్లకు పంపించినంత మాత్రాన ఉద్యమం ఆగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. మేం తప్పు చేసి జైళ్లకు వెళ్లట్లేదు, ధర్మం కోసం జైలుకు వెళ్లినం అంటూ బండి సంజయ్ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. 317 జీవో ఎందుకు తెచ్చినవో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. నాడు సీపీఎం, సీపీఐ పార్టీలను విమర్శించిన కేసీఆర్ ఆ పార్టీలతో ఎలా జతకడుతున్నాడని ప్రశ్నించాడు. తెలంగాణలో ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 317 జీవోను చెత్త బుట్టలో వేయడం ఖాయమని బండి సంజయ్ తెలిపారు.
317 జీవోకు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, బండి సంజయ్, ఈటల రాజేందర్ లతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీ శ్రేణులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 317 జీవో రద్దు కోసం జైలుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభను సీఎం హిమంత బిశ్వ శర్మ సన్మానించారు.