హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

పల్లె బాట పట్టిన జనం.. హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీహైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సమయం దగ్గర పడుతోంది. స్కూళ్లకు సెలువులు వచ్చాయి. పలు ఉద్యోగ సంస్థలు కూడా పండుగ సెలవులు ప్రకటించాయి. దీంతో జనాలు తమ పిల్లలను తీసుకుని పట్నాలు వదిలి సొంతూళ్ల బాట పట్టారు.ఈ క్రమంలోనే ఆదివారం నాడు హైదరాబాద్‌ – విజయవాడ నేషనల్‌ హైవేపై రద్దీ ఏర్పడింది.

నేషనల్‌ హైవే -65పై వాహనాలు బారులు తీరాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రత సాధారణం కనిష్ట స్థాయిలో నమోదు అవుతుండటంతో.. జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు ఏర్పడింది. దీంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్తున్నారు. ఇక టోల్‌ ప్లాజాల దగ్గర కూడా నగదు రహిత చెల్లింపు ఫాస్టాగ్‌తో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.

సాధారణ రోజులకంటే ప్రస్తుతం వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. దీంతో టోల్‌ప్లాజాల దగ్గర టోల్‌ట్యాక్స్‌ చెల్లింపు కేంద్రాలను అధికారులు పెంచారు. పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక బస్సులను ఏర్పాటు నడుపుతున్నాయి.

పండుగకు పల్లెలకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ ఆర్టీసీ 4,360 బస్సులను ఏర్పాటు చేసింది. ఇందులో 590 బస్సులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారు. ప్రత్యేక బస్సుల్లో తెలంగాణ ఆర్టీసీ ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు. ఏపీ ఆర్టీసీ మాత్రం అదనపు చార్జీలను వసూలు చేస్తోంది.