ఫుడింగ్ అండ్ మింక్ పబ్, బార్ లైసెన్స్ రద్దు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ గా స్పందించారు. అయితే ఫుడింగ్ అండ్ మింక్ పబ్ యాజమాన్యం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రూల్స్ ని ఉల్లంఘించిన నేపథ్యంలో పబ్, బార్ లైసెన్స్ ను తక్షణమే రద్దు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్, సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఫుడింగ్ అండ్ మింక్ పబ్, బార్ లైసెన్స్ ను రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈక్రమంలో రాష్ట్రంలో ఉన్న పబ్ యజమానులతో ఈ యేడాది జనవరి 31న హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హోటల్ లో సమన్వయ సమావేశం నిర్వహించామని మంత్రి గుర్తు చేశారు. పబ్ లలో డ్రగ్స్ వినియోగం జరుగకుండా పబ్ యజమానులే బాధ్యత వహించాలని గత సమావేశంలోనే మంత్రి హెచ్చరించారు.
డ్రగ్స్ వినియోగంపై పబ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే వారి లైసెన్సును రద్దు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. నిబంధనలను పాటించని పబ్ ఓనర్లు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. నిన్నటి ఘటను పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇక డ్రగ్స్ నిర్మూలనలో భాగంగానే రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారని మంత్రి తెలిపారు. నిబంధనలు పాటించని అన్ని పబ్ లు, బార్ లపై నిరంతరం దాడులు చేస్తామని తేల్చి చెప్పారు. డ్రగ్స్ రాకెట్ కు సంబంధం ఉన్న ఎంతటివారినైనా ఉపేక్షేంచేది లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.