రాజధానిపై బీజేపీది వంద నాలుకల ధోరణి

రాజధానిపై బీజేపీది వంద నాలుకల ధోరణి

అమరావతి: మూడు రాజధానులపై అసెంబ్లీలో తీర్మానం చేసి సంవత్సరం గడిచిపోయింది. అమరావతి రైతులు, ప్రజానీకం చేపట్టిన ఉద్యమం ప్రారంభమై సంవత్సరం నిండింది. ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపట్టినా ఎక్కువ భాగం వివాదాస్పద నిర్ణయాలు, కక్ష రాజకీయాలు, వ్యతిరేక చర్యలతో కాలం గడిచిపోయింది. పాలన కూడా కుంటుపడుతోంది. ముఖ్యమైన అంశాలపై లిటిగేషన్లతో ప్రభుత్వం కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఈ కాలంలో రాజధాని అభివృద్ధి స్తంభించింది. సంక్షేమం కొంతలో కొంత మెరుగైనా రాష్ట్రమంతా అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది. ఆనాడు ప్రపంచ స్థాయి, అద్భుత రాజధాని అంటూ టీడీపీ ప్రభుత్వం ఆశలు రేకెత్తించింది. పరిమిత పనులతో సరిపెట్టింది. నేడు రాజధానిని ముక్కలు చేసే పేరుతో ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.

రాజధానిని, రాష్ట్రాన్ని నిండా ముంచిన బీజేపీ
ఆరున్నర సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీనే అధికారంలో కొనసాగుతోంది. ఈ కాలమంతా రాజధానికి, రాష్ట్రానికి బీజేపీ, కేంద్రం తీరని ద్రోహం చేసింది. బీజేపీ నేత వీర్రాజుకు అమరావతి అకస్మాత్తుగా గుర్తొచ్చింది. 2024లో రాష్ట్రంలో అధికారం లోకి తీసుకు వస్తే రాజధానిని 5 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తామని సెలవిచ్చారు. మాట మార్చడం, మడమ తిప్పడం తమకు అలవాటు లేదని నమ్మబలుకుతున్నారు. ఆరున్నరేళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న విషయం మర్చిపోయినట్లున్నారు. గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో టీడీపీ తో కలిసి బీజేపీ అధికారంలో కొనసాగిన సంగతి గుర్తున్నట్లు లేదు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిదే.

రాజధాని శంకుస్థాపన సందర్భంలో మోడీ చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి తెచ్చి రాజధానికి నిధులు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నోట్లో మట్టి కొట్టారు. గత రెండు సంవత్సరాల నుంచి కేంద్ర బడ్జెట్లో అమరావతి ప్రస్తావనే లేదు. విజయవాడ మెట్రో గాలికొదిలేశారు. అమరావతికి రైలు ప్రాజెక్టు ఏనాడో మర్చిపోయారు. ప్రత్యేక హోదా మాట ఇచ్చి నమ్మించి మోసం చేసింది బీజేపీ కాదా ? వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఏమైంది? పోలవరం నిధుల కోత పెడుతున్నారు. కడప ఉక్కు ఊసే లేదు. ‘అమరావతి లోనే బీజేపీ ఆఫీస్‌ నిర్మించుకున్నాం. మమ్మల్ని నమ్మండి’ అని వీర్రాజు పదే పదే చెబుతున్నారు. ఆఫీసు నిర్మించుకుంటున్నారు కానీ రాజధాని నిర్మించడం లేదు.

రాష్ట్రంలో అధికారం ఇస్తే తప్ప రాజధాని నిర్మాణం చేయమని పరోక్షంగా ప్రజలను బెదిరిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో బీజేపీ కి ఓట్లు రాలేదనే కక్షతోనే హోదా ఇవ్వలేదా? రాజధానికి నిధులు ఇవ్వటం లేదా? ఈ కాలమంతా రాజధానిపై పరస్పర భిన్నమైన ప్రకటనలతో బీజేపీ నేతలు ప్రజలను గందరగోళ పరుస్తూ వచ్చారు. మూడు రాజధానులు కాకపోతే 30 రాజధానులు ఉంటాయని ఒక నేత, మూడు రాజధానులు కాదు మూడు సచివాలయాలు ఉండాలని మరో నేత ఇలా పలురకాల వ్యాఖ్యలు చేశారు. రాజధానితో తమకు సంబంధమే లేదనీ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసింది. అమరావతి అంగుళం కూడా కదలదని చెప్పిన నేతలు ఇప్పుడు ఎక్కడున్నారు? ఢిల్లీని తలదన్నిన రాజధాని నిర్మిస్తామని 2014లో మోడీ ఇచ్చిన మాట ఏమైంది? బీజేపీ నేతలతో తేడాల వల్ల ఇలా మాట్లాడుతున్నారని కొందరు అమాయకంగా అనుకుంటున్నారు. బీజేపీ నేతలు ఈ నాటకంలో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అంతే తప్ప పార్టీ విధానంలో గందరగోళం లేదు.

ప్రజలను గందరగోళపరిచి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడమే వారి విధానం. దేశంలో వంద రాష్ట్రాలు ఉండాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలను ముక్కలు చేసే విధానం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ది. మతం పేరుతోనే కాదు ప్రాంత ప్రజల మధ్య కూడా చిచ్చు పెట్టే రాజకీయం బీజేపీది. అమరావతి రైతులపై కేసులు పెడితే సహించం, దౌర్జన్యం చేస్తే ఊరుకోమని వీర్రాజు ఘీంకరించారు. దేశంలో రైతుల మీద నిర్బంధం, పౌర హక్కుల ఉద్యమ నేతలను ఏళ్ల తరబడి జైలులో పెట్టడం, దళితులు, మైనారిటీలపై దాడులు…చేస్తున్న బీజేపీ దుర్మార్గాన్ని అందరూ గమనించాలి. మోడీ దేవదూత అని ఓ బడా నేత ఆనాడే పొగడ్తలు కురిపించారు. నేను ఆ మోడీ దూతనని నేడు వీర్రాజు చెప్పుకుంటున్నారు. మోడీ రైతుల పక్షమని చిలక పలుకులు పలుకుతున్నారు.

మోడీ రైతుల పక్షమో అంబానీ, అదానీ పక్షమో దేశం కోడై కూస్తోంది. ఢిల్లీలో పోరాడుతున్న రైతాంగానికి ఖలిస్తాన్‌ ఉగ్రవాదుల ముద్ర వేసిన బీజేపీ అమరావతి రైతులపై ప్రేమ కురిపిస్తూ కపట నాటకం ఆడుతోంది. రాజధానిని, రాష్ట్రాన్ని నిండా ముంచిన బీజేపీని నమ్ముకుంటే ఆత్మహత్యా సదశ్యమే అవుతుంది. బీజేపీ అధికారం కోసం పావులు కదుపుతోంది. బీజేపీ ప్రమాదాన్ని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారు. కానీ కొత్త రూపాలలో ప్రజలను నమ్మించడానికి కొత్త కుట్రలకు బీజేపీ తెర లేపుతోంది. అందుకే రాష్ట్ర రాజధానిని నాశనం చేయడంలో ప్రధాన ముద్దాయి బీజేపీ. తోడు ముద్దాయిలు వైసీపీ, టీడీపీలు

బీజేపీ, టీడీపీ , వైసీపీలది ఒకటే వైఖరి

వైసీపీ పార్టీ , ప్రభుత్వం రాజధానిపై పునరాలోచన చేయాలి. వివాదాలను కట్టిపెట్టాలి. ఉన్న పరిమిత వనరులతోనైనా రాజధాని నమూనా మార్చాలి తప్ప, స్థలాన్ని మార్చాలనుకోవటం వృథా ప్రయాసే. పోటీ ఉద్యమాలతో, అణిచివేతతో రాజధాని ప్రజల గొంతు నొక్కాలనుకోవడం తగదు. గతంలో రాజధానిలో జరిగిన అవినీతిపై విచారణ చేయవచ్చు. దోషులైన అధికారులను గత పాలకులను శిక్షించవచ్చు. కానీ ప్రజలను బలి చేయడం తగదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ అండతో రాజధానిని ముక్కలు చేయవచ్చని వైసీపీ , ముఖ్యమంత్రి జగన్‌ భ్రమ పడుతున్నారు. మోడీ, అమిత్‌ షా లను వేడుకుంటే జరిగేది ఏమీ లేదు.

రాష్ట్ర ప్రజలను నమ్ముకుంటే మంచిది. అన్నీ ఒకే చోట కేంద్రీకరించాలనే చంద్రబాబు మోడల్‌ రాజధాని విఫలమయ్యింది. ప్రపంచానికే ఆదర్శం అని చెప్పిన భూ సమీకరణ ఎదురు కొట్టింది. రైతుల్ని, పేదలను నట్టేట ముంచింది. ఇప్పటికీ ఈ వాస్తవాన్ని గమనించకుండా సింగపూర్‌ మోడల్‌ గురించి గొప్పలు చెప్పుకోవడం టిడిపి కి తగదు. ఇప్పుడైనా తప్పులు గుర్తించి సరిదిద్దుకోవటం తదనుగుణంగా వ్యవహరించడం మంచిది. అమరావతి ప్రాంత రైతులు ఈ దుస్థితిలో వుండడం వెనుక తన బాధ్యత నుంచి టీడీపీ తప్పించుకోలేదు.

అప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి, రాజధానికి ద్రోహం చేసిన బీజేపీ పై పల్లెత్తు మాట మాట్లాడకుండా మోడీ భజన చేస్తే అమరావతి నిలబడుతుందా? కేంద్రంపై పోరాడకుండా అమరావతి రైతులను కాపాడతాం అంటే ఎలా నమ్ముతారు? అమరావతి ఉద్యమం విశాలంగా, విస్తృతంగా నడపాల్సింది పోయి అందులోనూ టీడీపీ తన రాజకీయ ప్రయోజనాన్ని చూసుకుంటే రాజధాని రైతులకు జరిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. బీజేపీ ,టీడీపీ, వైసీపీలది అనేక విధానాలలో ఒకటే వైఖరి. ఆనాడు బీజేపీ, టీడీపీలు కలిసి భూసమీకరణ చేపట్టాయి. పూర్తిగా విఫలం అయింది. ఈనాడు వైసీపీ విఫలమైన భూ సమీకరణను రాష్ట్రమంతా చేపడుతోంది. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు సాధించటంలో ఆనాడు, ఈనాడు రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కేంద్రంపై ఒత్తిడి చేయడంలో టీడీపీ, వైసీపీ లది మెతక వైఖరే. ఇరు పార్టీలది లోపాయికారి కుమ్మక్కే. రాజధాని లోను, రాష్ట్రంలోనూ పౌర హక్కులను, ఉద్యమాలను అణచివేతలో ఎవరికి ఎవరు తక్కువ తినలేదు. రాజధాని ప్రాంతంలోని దళిత, అసైన్డ్‌ రైతులు, భూమి లేని పేదలు, కార్మికుల బాగోగులను గాలికొదిలేశాయి. ఆనాడు సింగపూర్‌, ఈనాడు దక్షిణాఫ్రికా నమూనాలు, విదేశీ కన్సల్టెన్సీలు, దుబారా ఖర్చులు, వృథా ఖర్చులు షరా మామూలే.

సీపీఎం సూత్రబద్ధ వైఖరి

రాజధాని, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సూత్రబద్ధ వైఖరికి సీపీఎం అన్ని వేళలా కట్టుబడి ఉంది. అమరావతి రాజధానిపై అసెంబ్లీలో అన్ని పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినందున రాజధాని స్థలం మార్పుపై వివాదం చేయడం తగదని ముందు నుంచి చెబుతూనే ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ అమరావతి సమ దూరంలో ఉంది కాబట్టి రాజధాని రైతులకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ ఇది మేలని వైఖరి తీసుకుంది. శాసనసభ, సచివాలయం ఒక దగ్గర ఉంటే పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మేలని సీపీఎం భావించింది.

హైకోర్టు కర్నూలులో పెట్టాలన్న ప్రభుత్వ ప్రతిపాదన పట్ల అభ్యంతరం లేదని సీపీఎం తెలిపింది. రాజధాని ఒకే చోట ఉన్నా అభివృద్ధి రాష్ట్రమంతా జరగాలని విద్యా, వైద్య సంస్థలు, పరిశ్రమలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలని, అదే నిజమైన వికేంద్రీకరణ అన్న వైఖరికి సీపీఎం ఎప్పుడూ కట్టుబడి ఉంది. దానికోసం నిరంతర పోరాటం సాగిస్తూనే ఉంది. ఇప్పటికే అమరావతిలో ప్రజా ధనం ఖర్చు పెట్టారు. కాబట్టి వృథా చేయడం సరికాదని, ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిలో మార్చటం రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టు అని భావించింది. ఆనాడు రాజధాని పూలింగ్‌ విధానం తప్పని, పరిమిత స్థలంలో రాజధాని నిర్మాణం చేసుకోవచ్చని చెప్పింది. పూలింగ్‌ను వ్యతిరేకించినందుకు ఆనాడు టీడీపీ అభివృద్ధి నిరోధకులుగా సీపీఎం కు ముద్ర వేసింది. ఈనాడు వైఎస్సార్‌ ప్రభుత్వం రాజధాని, ఇళ్ల స్థలాలు పేరుతో విశాఖలో భూ సమీకరణ పేరు చెప్పి దళితుల అసైన్డ్‌ భూములు లాక్కుంటే తప్పని చెప్పింది, పోరాడింది.

హైకోర్టులో కేసు వేసింది. దళితుల పక్షాన నిలబడి పోరాడినందుకు ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీ లోనే సీపీఎం పైన నిందలు వేయడం చూశాం. రాజధాని అభివృద్ధి అంటే రాజధానిలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలని దానికై నిరంతర సీపీఎం కృషి సాగిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ రైతులకు కౌలు, సమానమైన ప్యాకేజీ అందించాలని, పేదలకు రాజధాని పెన్షన్‌ ఇవ్వాలని, హామీలు అమలు చేయాలని అనేక ఉద్యమాలు సాగించింది. పాక్షిక విజయాలు సాధించింది. ఆనాడు టీడీపీ అడ్డంకులు పెట్టినా నిర్బంధాలు ప్రయోగించినా ప్రజల మద్దతుతో తన కృషి సాగించింది.

నేడు వైసీపీ ప్రభుత్వంలో రాజధానిలోని పారిశుధ్య కార్మికులకు 7 నెలలు జీతాలు ఇవ్వకపోతే కార్మికులకు అండగా సీఐటీయూ పోరాటం కొనసాగిస్తోంది. హైకోర్టు, రాష్ట్ర సచివాలయం కాంట్రాక్టు సిబ్బంది వేతనాలు, భద్రతపై కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటానికి అండగా సీపీఎం నిలుస్తోంది. పేదలకు రాజధాని పెన్షన్‌ పెంపు, అసైన్డ్‌ భూములకు సమానమైన ప్యాకేజీపై ఎన్నికల ముందు తర్వాత వైసీపీ ప్రభుత్వ నేతలు మాటలు తప్ప చేతలు లేవు. రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్యలపై జరుగుతున్న కృషి, పోరాటం కొన్ని వర్గాల మీడియాకు పట్టదు. సీపీఎం రాజధాని ఉద్యమంతో గొంతు కలుపుతోంది. వారికి అండగా నిలుస్తోంది. అదే సందర్భంలో గత ప్రభుత్వాలు విధానాల విషయంలో తన స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తోంది. ఉమ్మడి ఉద్యమాలకు మద్దతు ఇస్తోంది.

బీజేపీ మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు

అమరావతి రైతులు, ప్రజలు వైసీపీ వైఖరిపై పోరాడుతున్నారు. బీజేపీ మోసాన్ని గమనిస్తున్నారు. ఆనాడు గుర్రాలపై ఊరేగిన టీడీపీ మంత్రులు కొందరు అడ్రస్‌ లేరని గుసగుసలు ఉన్నాయి. ఆనాడు సీపీఎం, వామపక్షాలు చెప్పినా వినకుండా ప్రభుత్వ మాటలు నమ్మి భూ సమీకరణలో భూములు ఇచ్చి మోసపోయామని భావించే వారు ఉన్నారు. కానీ కొందరు నేతలు రాజధానిని నట్టేట ముంచిన బీజేపీ ప్రమాదాన్ని గమనించటం లేదు. బీజేపీని నమ్ముకుంటే అమరావతి నిలబడుతుందని భ్రమ పడుతున్నారు. ఈ వైఖరితో రైతులకు, రాజధాని ప్రజలకు మేలు జరగదని అనుభవం తెలుపుతోంది.

ఇప్పటికైనా నేతలు గమనించాలి. ఢిల్లీలో అనేక రాష్ట్రాలకు చెందిన రైతులు పోరాడుతూ ఉంటే వారికి సంఘీభావం తెలపటానికి రాజధాని జేఏసీ నేతలకు తటపటాయింపులు ఉన్నాయి. ఢిల్లీలో రైతుల ఉద్యమం విజయం సాధిస్తే అమరావతిలో ప్రజా ఉద్యమానికి మేలు జరుగుతుందని వారు గమనించాలి. ఢిల్లీలో రైతు ఉద్యమం జరుగుతున్న తరహాలోనే రాజధాని లోనూ విశాల ఉద్యమం సాగాలి. అది అమరావతికే పరిమితమైన ఉద్యమం కాదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నైతిక మద్దతు ఉండే విధంగా సాగాలి. రాజధాని కొరకే కాదు, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, కడప ఉక్కు, విభజన హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలందరూ ఉమ్మడిగా ఉద్య మించాలి. అమరావతి రాజధానిని నిలబెట్టుకోవటం, రైతులు, కూలీలు, పేదలకు న్యాయం జరగటం ఉద్యమ లక్ష్యంగా ఉండాలి. అప్పుడే అమరావతి ఉద్యమం విజయం సాధిస్తుంది.