సీఎం పర్యటనపై హరీష్ రావు క్షేత్ర స్థాయి పరిశీలన

సీఎం పర్యటనపై హరీష్ రావు క్షేత్ర స్థాయి పరిశీలనసిద్ధిపేట జిల్లా: ఈనెల10న ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధిపేట నియోజకవర్గంలో పర్యటించేనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి పనుల ఏర్పాట్లను, పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పర్యటన సజావుగా జరిగేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పై అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హల్ లో మంత్రి సమావేశం అయ్యారు. సీఎం జిల్లా పర్యటన విజయవంతం చేసే దిశగా జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఆర్డీవోలకు మంత్రి బాధ్యతలు అప్పగించారు. అప్పగించిన పనిలో అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నం కావాలని, సీఎం పర్యటన విజయవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట శివారు నర్సాపూర్ లో రూ. 163 కోట్లతో నిర్మించిన ఇండ్లు లేని నిరుపేదలకు ప్రతిష్ఠాత్మకంగా అన్ని హంగులు, సదుపాయాలతో నిర్మించిన తొలి గేటేడ్ హౌసింగ్ 2460 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల గృహ సముదాయంకు లాంఛనంగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో పాటు రూ. 135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, రూ.278 కోట్లతో సిద్దిపేట పట్టణంలో చింతల్ చెరువు వద్ద నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మరియు రూ.8 కోట్లతో నిర్మించిన రంగనాయక సాగర్ అతిథి గృహంకు సీఎం ప్రారంభోత్సవం , రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల ఆసుపత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు మిట్టపల్లి రైతు వేదిక, విపంచి ఆడిటోరియంలను సీఎం ప్రారంభి స్తారు. కోమటి చెరువు అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. చివరగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, సీపీ జోయల్ డెవిస్, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, శిక్షణ కలెక్టర్ దీపక్ తీవారి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, జిల్లా రెవెన్యూ బాధ్యులు బి.చెన్నయ్య, ఆర్డీవోలు అనంత రెడ్డి, జయ చంద్రా రెడ్డి, విజయేంద్ర రెడ్డి, డీఎఫ్ఓ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ రమణా చారి, జెడ్పీ సీఈఓ శ్రవణ్, డీపీఓ సురేష్ బాబు, డీఆర్డీఓ గోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.