రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం నారా లోకేష్ తొలి అడుగులు

రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం నారా లోకేష్ తొలి అడుగులు

రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం నారా లోకేష్ తొలి అడుగులువరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అన్యాయానికి గురైన ప్ర‌జ‌ల‌కు అండ‌గా, ధ్వంస‌మైన రాష్ట్రం పున‌ర్నిర్మాణం ల‌క్ష్యంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ‘యువ‌గ‌ళం’ పేరుతో పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. కుప్పం నుంచి శుక్ర‌వారం ఆరంభ‌మై 4 వేల కిలోమీట‌ర్లు, 400 రోజుల‌ పాటు సాగే యాత్ర‌కి శ్రీకారం చుట్టారు. హైద‌రాబాద్ నివాసంలో బుధ‌వారం ఉద‌యం కుటుంబంతో పూజ‌లు నిర్వ‌హించారు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్న లోకేష్, అత్తామామ‌లు, బంధువులంద‌రి ఆత్మీయ ఆశీస్సులు అందుకున్నారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు కొడుకుని హ‌త్తుకుని ఉద్విగ్నానికి గుర‌య్యారు. ‘వెళ్లొస్తాను నాన్నా’ అంటూ తండ్రికి చెప్పిన లోకేష్‌.. త‌న బిడ్డ దేవాన్ష్‌ని అక్కున చేర్చుకుని ‘వీడియో కాల్ లో మాట్లాడుకుందాం చిన్నా’ అని స‌ముదాయించి బ‌య‌లుదేరారు. భారీ ర్యాలీతో ఎన్టీఆర్ ఘాట్‌కి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు తాత నంద‌మూరి తార‌క‌రామారావుకి నివాళులు అర్పించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకుని క‌డ‌ప వెళ్లారు. కడపలో నారా లోకేశ్ కి టీడీపీ శ్రేణులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికాయి. దేవుని క‌డప వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. అనంత‌రం కడప పెద్దదర్గాని సంద‌ర్శించారు. పెద్ద దర్గాలో చాదర్ సమర్పించారు. మత పెద్దలను అడిగి దర్గా విశిష్టతను తెలుసుకున్నారు. క‌డ‌ప‌లోనే మరియాపురం చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వ‌హించారు. రోడ్డు మార్గంలో తిరుమ‌ల చేరుకున్నారు.