గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం : చల్లా
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నాయని పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పల్లెలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ఎన్ని నిధులైనా మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఆత్మకూరు మండలం మల్కపేట, హౌస్ బుజుర్గ్ గ్రామాల్లో రూ. 40 లక్షలతో నూతనంగా నిర్మించబోయే గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులకు నేడు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనాతీరుపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాలు, రాష్ట్రాల అభివృద్ధితో దేశం అభివృద్ధి చెందుతుందని ఆ లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారని అన్నారు. గ్రామపంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు. ఆధునిక హంగులతో భవన నిర్మాణం జరుతుందన్నారు. గత ప్రభుత్వాలలో పంచాయతీ భవనాలు లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాలు, ఇతర అద్దె భవనాల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కొత్త భవనాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే గ్రామస్తులు ఐక్యతతో ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, మార్కెట్ , సొసైటీ చైర్మన్లు మరియు కమిటీ సభ్యులు, మండల అధికారులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.