బైరి నరేష్ పై సుబేదారి పీఎస్ లో ఫిర్యాదు

బైరి నరేష్ పై సుబేదారి పీఎస్ లో ఫిర్యాదు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : హిందూ దేవతలపై, అయ్యప్ప స్వామి జననంపై బైరి నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రెండ్రోజుల క్రితం ఓ సభలో హిందూ దేవుళ్లను, అయ్యప్పస్వామిని కించపరుస్తూ బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. బైరి నరేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్ప దీక్షా స్వాములు నిరసనలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కోస్గీలో వీడియోలు తీస్తూ అనుమానాస్పదంగా వ్యవహరించిన బహాలరాజు అనే వ్యక్తిపై అయ్యప్ప దీక్షా స్వాములు దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

బైరి నరేష్ పై సుబేదారి పీఎస్ లో ఫిర్యాదు

ఇప్పటికే హైదరాబాద్ లోని మూడు పోలీస్ స్టేషన్ లలో నరేష్ పై ఫిర్యాదులు చేశారు. బైరి నరేష్ ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలంటూ విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లాలోనూ అయ్యప్ప దీక్షా స్వాములు నిరసన వ్యక్తం చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ కు చెందిన మణికంఠ సేవాసమితి , భజరంగదళ్ బైరి నరేష్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడింది.

బైరి నరేష్ పై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ యువ నాయకుడు ఆదిత్య సాయి, మాజీ కార్పొరేటర్ శివశంకర్, మణికంఠ సేవాసమితి , భజరంగదళ్ అయ్యప్ప దీక్షా స్వాములు, భజరంగదళ్ సభ్యులు సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిందూదేవుళ్లను కించపరిచిన బైరి నరేష్ అయ్యప్ప దీక్షా స్వాములకు, హిందువులకు క్షమాపణ చెప్పే వరకు నిరసనలు భగ్గుమంటూనే ఉంటాయని వారు హెచ్చరించారు.