శ్రీవారి దర్శనం.. సామాన్యులకు నరకం..
వరంగల్ టైమ్స్, తిరుపతి : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ మధ్యకాలంలో సామాన్యులకు నరకప్రాయం అయిందని స్థానిక సామాజికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో స్వయంగా శ్రీవారి దర్శనానికి వెళ్లి క్యూ కాంప్లెక్స్ లో వాళ్లు అనుభవించిన నరకాన్ని మాంగాటి గోపాల్ రెడ్డి , జగన్నాథం నాయుడు, సుధాకర్ రెడ్డి, కన్నారెడ్డి, పార్థసారథిలు మీడియా ముందు విన్నవించారు. నేడు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఒకప్పట్లో వైకుంఠ ఏకాదశి అంటే రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కలుగజేసే వారని తెలిపారు. కానీ నేడు పది రోజులు ఏకధాటిగా దర్శనాలు కల్పిస్తామని, గొప్పలు చెప్పి, వీఐపీల సేవలో తరిస్తూ క్యూ కాంప్లెక్స్లో భక్తుల ప్రాణాలతో చలగాటం ఆడారని ఆరోపించారు. టీటీడీ పాలకమండలి యాజమాన్యం అసలు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారా, లేక వేరే మతాన్ని ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నించారు.ఈ ఏకాదశి పర్వదినాలలో టోకెన్లు కట్టుకున్న వారిని ఉసిగొలిపేలా రన్నింగ్ క్యూ అని ప్రచారం చేసి, జన భక్తసంద్రం తరలివచ్చేలా చేసి వారి అనారోగ్యానికి కారుకులయ్యారని దుయ్యబట్టారు. తిరుపతిలో ఉచిత దర్శనాల కోసం దాదాపు తొమ్మిది కౌంటర్లను ఏర్పాటుచేసి, టోకెన్ల జారీ, దర్శన భాగ్యం కల్పించే కోణంలో పూర్తిగా టీటీడీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీల సేవలో పడి, గంటల తరబడి సామాన్యులను క్యూ కాంప్లెక్స్ లో పడవేయడం దారుణమన్నారు. స్వామివారి దర్శనానికి వెళ్లిన ఎందరో స్థానికులు కథలు కథలుగా వారి కష్టాలను చెప్పుకుంటున్నారన్నారు. అధికారులు ఇకనైనా తీరు మార్చుకొని, మరోసారి ఇది పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని వారు హెచ్చరించారు.