ముగిసిన మహిళల దేహదారుఢ్య పరీక్షలు 

ముగిసిన మహిళల దేహదారుఢ్య పరీక్షలు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : హనుమకొండ కాకతీయ విశ్వవిద్యాలయము క్రీడా మైదానంలో జరుగుతున్న స్టయిఫండరీ ట్రైనీ కానిస్టేబుల్ మరియు సబ్-ఇన్స్పెక్టర్ల నియామకాల్లో భాగంగా ఈ నెల 10 నుండి మహిళా అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు బుధవారం ముగిసాయి. ఉదయం 5గంటల నుండి కేయూ మైదానానికి చేరుకున్న మహిళా అభ్యర్థినిల ధృవీకరణ పత్రాల పరిశీలన అనంతరం 800 మీటర్ల పరుగును నిర్వహించారు. ఈ పరుగులో అర్హత సాధించిన అభ్యర్థినిలకు ఎత్తుతో పాటు లాంగ్ జంప్, షాట్పుట్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు.ముగిసిన మహిళల దేహదారుఢ్య పరీక్షలు నేడు నిర్వహించిన మహిళా దేహదారుఢ్య పరీక్షల్లో 1317 అభ్యర్థినిలకు గాను 1176 అభ్యర్థినిలు హాజరు కాగా ఇందులో 863 మంది అభ్యర్థినిలు తుది వ్రాత పరీక్షకు అర్హత సాధించారు. అలాగే గత నాలుగు రోజులుగా మహిళలకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో మొత్తం 4,784 మంది అభ్యర్థినిలకు గాను 4,303 అభ్యర్థినిలు హాజరుకాగా ఇందులో 3,128 మంది అభ్యర్థినిలు వ్రాత పరీక్షకు అర్హత సాధించారు. డిసెంబర్ 15 నుండి వచ్చే నెల జనవరి 3 వరకు పురష అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించబడుతాయని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు.

ఈ పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహింబడుతున్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఉద్యోగం వచ్చేందుకు సహాయం చేస్తామని డబ్బు వసూళ్ళకు పాల్పడే కేటుగాళ్ళ పట్ల అభ్యర్థులు అప్రమత్తంగా వుండాలని సీపీ తెలిపారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దని, ఇలాంటి వారు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినట్లైతే తక్షణమే వరంగల్ పోలీస్ కమిషనర్ సెల్ నంబర్ 9491089100 కు గాని అదనపు డీసీపీ సెల్ నంబర్ 9440795201కు గానీ సమాచారం అందించాలని సూచించారు. సమచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా వుంచబడతాయని పోలీస్ కమిషనర్ అభ్యర్థులకు సూచించారు.