రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల టూర్ షెడ్యూల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల టూర్ షెడ్యూల్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26 నుంచి 30 వరకు దక్షిణాది విడిది చేయనున్నారు. దక్షిణాది విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి టూర్ షెడ్యూల్ ఖరారైంది.ఈ నెల 28న తెలంగాణకు రానున్న రాష్ట్రపతి మూడురోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల టూర్ షెడ్యూల్

*3 రోజుల టూర్..
డిసెంబర్ 28న ఉదయం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి హైదరాబాద్ కు చేరుకుంటారు. డిసెంబర్ 29న బొల్లారం రాష్ట్రపతి నిలయంలో వివిధ రంగాల ప్రముఖులు, అతిథులతో భేటీ అవుతారు. డిసెంబర్ 30న సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

ఇక రాష్ట్రపతి పర్యటన ఖరారైన నేపథ్యంలో పోలీస్, ఆర్మీ, కంటోన్మెంట్ అధికారులు, బొల్లారం రాష్ట్రపతి నిలయం సిబ్బంది, జీఏడీ, ఇతర కీలక శాఖలతో సీఎస్ సమావేశం నిర్వహించనున్నారు. త్వరలోనే కోఆర్టినేషన్ మీటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. నేషనల్ పోలీస్ అకాడమీ, సమతాముర్తి, కేశవ్ మెమోరియల్ సొసైటీ, జి. నారాయణమ్మ కళాశాలలను పర్యటించనున్నారు.

*డిసెంబర్ 28న రామప్ప సందర్శన..
ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని ఈ నెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం రామప్పను సందర్శించి రుద్రదేవుడిని దర్శనం చేసుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు.

ఏపీలోనూ పర్యటన..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఇటీవల ఏపీలో పర్యటించిన ఆమె ఘనంగా సన్మానం అందుకున్నారు. పోరంకిలో ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్మానం చేశారు. ఆమె మూడు రోజుల పాటు విజయవాడ, విశాఖ, తిరుపతిలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఇప్పుడు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలానికి ఎంతో ప్రత్యేకత ఉంది.

ఈ నెల 26న రాష్ట్రపతి ముర్ము శ్రీశైలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం శ్రీశైలం చేరుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అలాగే కేంద్ర టూరిజం శాఖ ద్వారా దేవస్థానం చేపట్టిన ప్రసాదం స్కీం పనులను ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా పుణ్యక్షేత్రాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. టూరిస్టులను ఆకర్షించేందుకు వీలుగా మరిన్ని సౌకర్యాలను కల్పించనున్నారు.

దక్షిణాది విడిది కోసం ప్రతీ యేడాది డిసెంబర్ చివర్లో రాష్ట్రపతి హైదరాబాద్ వస్తుంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఐతే కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో దక్షిణాది విడిదికి రాష్ట్రపతి రాలేదు. ఇదిలా ఉంటే దేశ 15వ రాష్ట్రపతి హోదాలో మొట్టమొదటిసారి శీతాకాల విడిదికి ద్రౌపది ముర్ము రానున్నారు.