హైడ్రాపై మరోసారి మండిపడ్డ తెలంగాణ హైకోర్టు
-ఏ అధికారంతో కూల్చివేతలు చేపట్టారు?
-ఫెన్సింగ్ వేయడానికి హైడ్రాకు ఉన్న అధికారమేంటి?
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి ప్రాంతంలోని పలు సర్వే నంబర్లలో ఉన్న తన భూమికి, హైడ్రా అక్రమంగా ఫెన్సింగ్ వేసిందంటూ రాహుల్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు.ఈ పిటిషన్ విచారిస్తూ అసలు హైడ్రా ఏ అధికారంతో ఫెన్సింగ్ వేసింది, నోటీసులు ఇవ్వకుండా చర్యలు ఎలా తీసుకుంటారని న్యాయమూర్తి నిలదీశారు. హైడ్రాకు పురపాలక శాఖ నుండి ఎలాంటి అనుమతులు అవసరం లేదని, ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని నోటి మాట ద్వారా ఫిర్యాదు అందినా ఫెన్సింగ్ వేసే అధికారం హైడ్రాకు ఉందని హైడ్రా తరపు న్యాయవాది తెలిపారు.హైడ్రా న్యాయవాది వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ, జీవో 99 ప్రకారం హైడ్రా పురపాలక శాఖ కిందే పనిచేయాల్సి ఉంటుందని, హైడ్రా చర్యలను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షించాల్సి ఉంటుందని హైకోర్టు జడ్జి పేర్కొన్నారు. తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ – 1905 ప్రకారం నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకోరాదని, వివాదాస్పద లేదా ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేసే ముందు హైడ్రా వద్ద అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉండాలి కదా అని ప్రశ్నించింది














