మున్సిపల్ ఎన్నికల్లో కవిత శుభారంభం

మున్సిపల్ ఎన్నికల్లో కవిత శుభారంభం

-వడ్డేపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకున్న ఏఐఎఫ్బీ

మున్సిపల్ ఎన్నికల్లో కవిత శుభారంభంవరంగల్ టైమ్స్, జోగులాంబ గద్వాల జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తు అభ్యర్థులు తమ ఉనికిని చాటుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ లను వెనక్కి నెట్టి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించింది. జాగృతి పార్టీ నేత వడ్డేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ సింబల్ తో పోటీ చేసి విజయం సాధించారు. మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డుల్లో కవిత జాగృతి పార్టీ అభ్యర్థులు పోటీ చేసి 1వ, 2వ, 4వ, 5వ, 6వ, 7వ, 8వ, 10 వార్డుల్లో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు. మిగిలిన రెండు స్థానాల్లో 9వ వార్డులో కాంగ్రెస్, 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు చెరో వార్డులో విజయం సాధించారు. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్నందున, వ్యూహాత్మకంగా సింహం’గుర్తుపై పోటీ చేసిన జాగృతి నాయకులు తొలి అడుగులోనే భారీ విజయాన్ని నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

గతంలో 2020 రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు 9 స్థానాల్లో గెలిచి బలమైన ముద్ర వేయగా, ఇప్పుడు కవిత నాయకత్వంలో ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు వడ్డేపల్లి వంటి చోట్ల పూర్తి మెజారిటీ సాధించడం విశేషం. ఈ విజయంతో తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త ప్రయాణం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందే ఆమె సింహం’ గుర్తును తమ గుర్తుగా ప్రకటించి, ప్రచారం నిర్వహించడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. సొంత పార్టీ అధికారికంగా ఆవిర్భవించక ముందే ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో తమకు బలం ఉందని ఆమె నిరూపించుకున్నారు.