సంబురంగా ఎదుర్కోలు..జగన్మోహినిగా యాదగిరీశుడు
-అశ్వవాహనంపై ఊరేగింపు
-బుధవారం రాత్రి తిరుకల్యాణ మహోత్సవం
వరంగల్ టైమ్స్, యాదగిరి గుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 24 మంగళవారం రాత్రి ఎదుర్కోలు మహోత్సవం అత్యంత ఘనంగా, వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ, అలంకార నరసింహస్వామిని అశ్వవాహనంపై ప్రధాన ఆలయ కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి, అమ్మవారితో కల్యాణానికి ముందు స్వామిని ఎదుర్కొనే ఈ సంప్రదాయ వేడుకను కన్నులపండువగా నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్షీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. జగన్మోహినిగా, లక్ష్మీదేవిగా అమ్మవారిని, నరసింహస్వామిని వేర్వేరుగా ఉంచి, ఆచారం ప్రకారం ఎదుర్కోలు ఘట్టం ముక్కోటి దేవతల సాక్షిగా మంగళవారం రాత్రి నయనానందకరంగా సాగింది. ఈ ఎదుర్కోలులో అర్చక బృందం స్వామివారి మహిమలు, భక్తజనరక్షణలు వివరిస్తూ ఆసక్తికరంగా వాదాలు జరిపారు.
“ఓం లక్ష్మీ నరసింహాయ నమః” నామస్మరణలతో యాదాద్రి క్షేత్రం మారుమోగిపోగా, భక్తులు వేలాదిగా హాజరై ఈ వేడుకను వీక్షించారు. స్వామివారు ఉదయం 9 గంటలకు జగన్మోహిని రూపంలో తిరుమాఢ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ముఖ్య ఘట్టమైన తిరుకల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి 9.30 గంటలకు అంగరంగవైభవంగా జరుపనున్నారు. మండపం ఎదురుగా వీవీఐపీలు, భక్తులకు ప్రత్యేకమైన బారికేడ్లతో ఏర్పాట్లు పూర్తిచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు హాజరుకానున్నారు.













