కొవిడ్‌ టీకా పంపిణీపై శిక్షణ

కొవిడ్‌ టీకా పంపిణీపై శిక్షణహైదరాబాద్: కొవిడ్ టీకా పంపిణీకి సంబంధించి కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో అన్ని జిల్లాల డీఎంహెచ్ఓ లతో తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్‌ టీకా పంపిణీకి సంబంధించి సోమ, మంగళవారాల్లో జిల్లాస్థాయి వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తరవాత మండలస్థాయి వైద్య సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తామన్నారు. రెండు రోజుల ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌ ప్రతినిధులు కూడా పాల్గొంటారు. తొలిరోజు శిక్షణలో వ్యాక్సినేషన్‌ ప్రణాళికలు, టీకా కోల్డ్‌ చైన్‌ నిల్వ, టీకా ఇవ్వాల్సిన విధానం, వ్యర్థాల నిర్వహణ, కొవిడ్ సాఫ్ట్‌వేర్‌ దాని పనితీరుపై అవగాహన కల్పిస్తారు. రెండోరోజు టీకా తీసుకున్న వారి పరిస్థితి ఎలా ఉంది? సైడ్‌ ఎఫెక్టులు ఏమైనా ఉన్నాయా? తదితర అంశాలతో పాటు పర్యవేక్షణ, టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించడం, భయాందోళనలు తొలగించడం, తగిన ప్రచారం కల్పించడం వంటి అంశాలపై ట్రైనింగ్ ఉంటుంది.