గుంటూరులో ఆ నిందితుడికి ఉరి శిక్ష ఖరారు

గుంటూరులో ఆ నిందితుడికి ఉరి శిక్ష ఖరారు

వరంగల్ టైమ్స్ , అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత యేడాది ఆగస్టు 15న పట్టపగలే నడిరోడ్డుపై కుంచాల శశికృష్ణ అనే యువకుడు రమ్యను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో 9 నెలల పాటు విచారణ కొనసాగించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు, నిందితుడికి ఉరి శిక్షను ఖరారు చేస్తూ తుది తీర్పును శుక్రవారం వెల్లడించింది. ఈ క్రమంలో రమ్య కుటుంబ సభ్యులు కోర్టు తీర్పును స్వాగతించారు. నిందితుడికి సరైన శిక్ష పడిందన్నారు. తమ బిడ్డ ఆత్మ శాంతి చేకూరేలా కోర్టు తీర్పు ఉందని రమ్య తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు.గుంటూరులో ఆ నిందితుడికి ఉరి శిక్ష ఖరారుఅయితే ఈ హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశారు. నిందితుడు శశికృష్ణను నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 36 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసి కోర్టుకు సమర్పించారు. అనంతరం 15 రోజుల్లోనే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ శారదామణి 28 మందిని విచారించగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. 9 నెలల పాటు విచారణ కొనసాగింది. కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విని ఈ నెల 26న విచారణ పూర్తి చేశారు. నేడు తుది తీర్పును కోర్టు వెల్లడించింది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని పరమయ్యకుంటకు చెందిన రమ్యను శశికృష్ణ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడు. శశికృష్ణ వేధింపులను భరించలేక అతని ఫోన్ నంబర్ ను రమ్య బ్లాక్ చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన శశికృష్ణ ఆమెపై పట్టపగలే కత్తితో దాడి చేశాడు. రమ్య శరీరంపై 8 కత్తిపోట్లను వైద్యులు గుర్తించారు. క్షణికావేశానికి లోనైన శశికృష్ణ రమ్యను హతమార్చాడని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.