జ్యోతిష్కుడి మాటలు..సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
వరంగల్ టైమ్స్, బెంగళూరు: ఆమె ఓ మంచి సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. కొడగు ప్రాంతానికి చెందిన ప్రేమించిన యువకుడితో తొమ్మిది రోజుల కిందటే వివాహం జరిగింది. అయితే ఓ జ్యోతిష్కుడు చెప్పిన అంశాలతో తీవ్రంగా భయపడిన ఆమె చివరకు ప్రాణాలు తీసుకుంది. బెంగళూరు బాగలకుంటె ఎంఈఐ లేఔట్‌కు చెందిన విద్యాజ్యోతి (29) ఆత్మహత్య చేసుకుంది. నువ్వు ఎక్కువ కాలం భూమ్మీద మనుగడ సాగించలేవు. త్వరలోనే నూకలు చెల్లుతాయి అని వర్క్ ఫ్రం హోంలో ఉన్న ఆమెకు ఓ జ్యోతిష్కుడు చెప్పాడు. అక్కడితో ఆగకుండా ఈ తొమ్మిది రోజులూ పూజలు చేయి. ఆఖరి రోజైన నీ తాళి తీసి అమ్మవారికి సమర్పించు..ఆపై నీకు మంచి జరుగుతుంది అని తెలిపాడు. దీంతో ఆయన మాటలకు విపరీతంగా భయపడిపోయిన ఆమె అలానే పూజలు చేసింది. తొమ్మిదో రోజు అమ్మవారికి తాళి తీసివ్వడానికి ముందు గదిలోకి వెళ్లింది. అనంతరం తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. జ్యోతిష్యడిపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది.














