బిల్లులన్నీ మూజువాణితోనే సాధ్యం: మోడీ

బిల్లులన్నీ మూజువాణితోనే సాధ్యం: మోడీవరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఎంతో హడావుడిగా తెలంగాణ ఏర్పాటు బిల్లును చర్చించకుండానే ఆమోదింపచేశారని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్ ను విమర్శించారు. 2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎన్నో కీలక బిల్లులను మూజువాణి ఓటుతోనే ప్రతిపక్షాలకు చర్చకు అవకాశం ఇవ్వకుండా ఆమోదించారు. మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఏపీలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో ఈ చట్ట సవరణను మూజువాణి ఓటుతోనే మమ అన్పించేశారు.

త్రిపుల్ తలాక్ బిల్లును సైతం లోక్ సభలో మూజువాని ఓటుతోనే ఆమోదించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ తో పాటు ఆర్జేడీ, బీజేడీ, ఏఐఏడీఎంకే, ముస్లింలీగ్ సభ్యులంతా చర్చకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసినా పట్టించుకోకుండా ఏకపక్షంగానే బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ బీజేపీ అత్యంత గోప్యత పాటించింది. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ లోక్ సభ, రాజ్యసభలు ఆమోదించడం, రాష్ట్రపతి ఆమోదంతో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ తక్షణమే అమల్లోకి వచ్చేలా గెజిట్ కూడా జారీ చేశారు.

ఇక కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలికేలా నూతన వ్యవసాయ చట్టాలు రూపొందించడంలో మోడీ ప్రభుత్వం అవలంభించిన ధోరణి అందరికీ తెలిసిందే. కనీస చర్చకు కూడా అవకాశం లేకుండా నిమిషాల వ్యవధిలోనే లోక్ సభ ఈ బిల్లులను ఆమోదించిన మోడీ సర్కార్ సంవత్సరం తర్వాత చెంపలేసుకుని వెనక్కి తీసుకుంది.