2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ కి బుద్ధి చెప్తాం : జంగా

2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ కి బుద్ధి చెప్తాం : జంగాజనగామ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం టేకులగూడెంలోని గెస్ట్ హౌజ్ లో జిల్లా, మండల, బ్లాక్ కమిటీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జంగా రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఆయన చర్చించారు.

ఇందులో భాగంగానే పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు అంశాలను కాంగ్రెస్ కార్యకర్తలతో చర్చించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పి, రాష్ట్రంలో కాంగ్రెస్ ఎగువేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణకోసం జిల్లాలోని కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన కోరారు.

కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి అవిరళంగా కృషి చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని జంగా రాఘవరెడ్డి ఈ సమావేశంలో కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమని, ఆ దిశగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని దిశానిర్ధేశం చేశారు.

కష్టపడిన కార్యకర్తలను గుర్తించి రాజకీయంగా ముందుకు నడిపించేందుకు రేవంత్ రెడ్డి అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలో ఉందని గుర్తు చేశారు. కష్టపడిన కార్యకర్తలకే భవిష్యత్ ఉందని అన్నారు. భవిష్యత్ కార్యాచరణ కోసం పార్టీ తీవ్రంగా శ్రమిస్తుందని , ఇందుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేసి ముందుకు నడవాలని జంగా రాఘవరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు.