ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి :

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి :హైదరాబాద్ : శుక్రవారం జరగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ ఆదేశించారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, అధికారులతో సీఈవో బుద్దభవన్‌ నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శశాంక్‌ గోయల్‌ తెలిపారు. పోలింగ్‌ సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్న ఆయన.. పోలింగ్‌ కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లు, కెమెరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆరు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల కోసం 37 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సీఈవో తెలిలిపారు. 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ వెబ్‌ కాస్టింగ్‌ లేదా వీడియోగ్రఫీ ఉంటుందని శశాంక్‌ గోయల్‌ చెప్పారు.