నేటి నుంచే 8వ విడత రైతు బంధు

నేటి నుంచే 8వ విడత రైతు బంధుహైదరాబాద్ : రైతుబంధు 8వ విడత నిధులు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. మొదటి రోజు ఎకరం వరకు వ్యవసాయ భూమి వున్నవారికి జమచేస్తారు. గతంలో మాదిరిగానే రోజుకొక ఎకరం చొప్పున పెంచుకొంటూ , 10 రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తారు. ఈ యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.7,645.66 కోట్లు విడుదల చేసింది. ఈ సీజన్ లో 66,61,638 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. మొత్తం 1 కోటి 52 లక్షల 91 ఎకరాలకు రైతుబంధు వర్తించనుంది.

డిసెంబర్ 10 నాటికి ధరణి పోర్టల్ లో నమోదైన పట్టాదారులతో పాటు ఆర్ఎఫ్ వోఆర్ పట్టాదారులకు కూడా 8వ విడత రైతుబంధు అందనున్నది. ఇప్పటివరకు ప్రభుత్వం 7 విడతల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ.43,036.63 కోట్లు జమచేసింది. 8వ విడతలో ఈ మొత్తం రూ.50వేల కోట్లు దాటనున్నది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వెంటనే వారి రిజిస్టర్డ్ ఫోన్ లకు మెస్సేజ్ లు పంపిస్తారు.