తొలి టెస్టు.. 2వ రోజు వర్షార్పణం

తొలి టెస్టు.. 2వ రోజు వర్షార్పణంసెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారీ స్కోర్ దిశగా సాగుతున్న టీం ఇండియాకు వర్షంతో బ్రేక్ పడింది. సెంచూరియన్ లో సోమవారం భారీ వర్షం కురవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే రెండో రోజు ఆట రద్దైంది. 3 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆదివారం ప్రారంభమైన బాక్సింగ్ డే టేస్టులో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోగా. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. నయా వైస్ కెప్టెన్ లోకేష్ రాహుల్ ( 248 బంతుల్లో 122 బ్యాటింగ్ ; 17 ఫోర్లు, ఒక స్పిన్నర్ ) అజేయ శతకంతో ఆకట్టుకోగా, సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానే ( 40 బ్యాటింగ్ ; 8 ఫోర్లు ) ధాటికి ఆడాడు.

సోమవారం మరింత భారీ స్కోరు చేసి ప్రత్యర్థి మీద ఒత్తిడి పెంచాలనుకున్న టీం ఇండియా ఆశలపై వరణుడు నీళ్లు కుమ్మరించాడు. ఉదయం నుంచే ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో మైదానం ఆటకు అనుకూలించదని భావించిన అంపైర్లు పలు సమీక్షల అనంతరం రెండో రోజు ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టు సఫారీ గడ్డపై ఇప్పటివరకు ఒక్కసారి కూడా సిరీస్ పట్టలేకపోయింది. ఈ సారి బలమైన బలగంతో దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన కోహ్లీసేన సిరీస్ పడుతుందనుకుంటే తొలి టెస్టులోనే మనవాళ్లకు వాతావరణం సవాలు విసిరింది. మంగళవారం కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయి.