ముధోల్ లో బీజేపీ జోరు ! 

ముధోల్ లో బీజేపీ జోరు !

ముధోల్ లో బీజేపీ జోరు ! వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి: ఎన్నికలకు ముందే ముధోల్ నియోజకవర్గంలో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మరోసారి గులాబీ జెండా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేస్తుంటే, ఈసారి బీఆర్ఎస్ కు చెక్ పెడతామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

*వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కావడమే ప్లస్ పాయింట్
నిజానికి ముధోల్ నియోజకవర్గం ఈ మధ్య ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తోంది. బాసర టెంపుల్ ఇదే నియోజకవర్గంలోకే వస్తుంది. అలాగే నిత్యం టెన్షన్ టెన్షన్ గా ఉండే భైంసా కూడా ఈ నియోజకవర్గంలోకే రావడం గమనార్హం. అభివృద్ధి విషయానికొస్తే కేసీఆర్ పాలనలో కొంత అభివృద్ధి అయితే జరిగింది. కానీ ఎమ్మెల్యే అంత యాక్టివ్ గా లేకపోవడం మైనస్ అన్న ప్రచారం అయితే ఉంది. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కొంచెం వేగం పెంచితే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేదని గులాబీ నేతలు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. అయినప్పటికీ వ్యక్తిగతంగా ఆయనకు మైనస్ అంశాలు పెద్దగా లేవనే చెప్పాలి. విఠల్ రెడ్డి ఇతర నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల లాగా వివాదాల్లో తలదూర్చే రకం అయితే కాదు.

ముధోల్ లో బీజేపీ జోరు ! *ఆయన లాబీయింగ్ విఠల్ రెడ్డి టికెట్ కి ఎఫెక్టా !
ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తండ్రి గడ్డెన్న కూడా ముధోల్ నుంచే ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కాబట్టి పార్టీలకతీతంగా విఠల్ రెడ్డికి చాలామందితో సత్సంబంధాలున్నాయి. అందుకే ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారని గులాబీ శ్రేణులు చెబుతుంటారు. వ్యక్తిగతంగా చెడ్డపేరు లేకపోయినప్పటికీ ఈసారి ఆయనపై కొంత వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ టికెట్ విఠల్ రెడ్డికి దక్కుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ టికెట్ కోసం సీనియర్ నేత వేణుగోపాలాచారి హైకమాండ్ దగ్గర గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించి విఠల్ రెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారని టాక్.

*బాసర టెంపుల్ సెంటిమెంట్ బీజేపీకి కలిసొస్తుందా ?
బీఆర్ఎస్ ను పక్కనబెడితే ముధోల్ లో బీజేపీ, కాంగ్రెస్ ఇక్కడ బాగా జోరు మీదున్నాయి. ముఖ్యంగా బాసర టెంపుల్ ఉండడం సెంటిమెంటుగా కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. దీనికి తోడు గతంలో జరిగిన భైంసా ఇష్యూ కూడా కమలం పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అన్నింటికి మించి ఇక్కడ బండి సంజయ్ పాదయాత్రతో బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగిందన్న వాదన ఉంది. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొంతమంది కమలం పార్టీ కండువా వేసుకున్నారు. ఇవన్నీ అంశాలు బీజేపీకి కలిసి వస్తాయన్న అంచనాలున్నాయి.

*కాంగ్రెస్ కు క్యాడర్ ఉన్నా క్యాండెట్ లోపం ఉంది !
బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ లో అంత జోష్ అయితే కనిపించడం లేదు. క్యాడర్ ఉన్నప్పటికీ పార్టీ నడిపించే గట్టి నాయకుడి లోటు అయితే ఇక్కడ ఉంది. దీంతో ఆ పార్టీ కొంచెం బ్యాక్ ఫుట్ లో ఉందన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఈసారి బీఆర్ఎస్- బీజేపీ మధ్య ద్రిముఖ పోరు అయితే తప్పేలా లేదు. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఎవరికిచ్చినా, బీజేపీ మాత్రం ఈసారి అస్త్రశస్త్రాలన్నింటితోనూ సిద్ధంగా ఉందని టాక్. రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ అయితే ఖాయంగా కనిపిస్తోంది.