బండి పాదయాత్రను అడ్డుకునే ఖర్మ మాకు లేదు
వరంగల్ టైమ్స్,హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ నెల 27న మాదాపూర్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో పాటు మంత్రులతో కేటీఆర్ సమావేశమై చర్చించారు. టీఆర్ఎస్ పార్టీ పాదయాత్రలను అడ్డుకునే కుట్ర చేస్తుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను పలువురు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బండి వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగానే స్పందించారు.
బండి సంజయ్ గద్వాల, వనపర్తి జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. అయితే పక్కనే 10 కిలోమీటర్లు దాటి వెళ్తే కర్నాటక రాయ్ చూర్ జిల్లా ఉందని, అవసరమైతే కార్లు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అక్కడికి వెళ్లి బీజేపీ పాలన గురించి అడిగి తెలుసుకోవాలని బండి సంజయ్ కి కేటీఆర్ సూచించారు. కర్నాటకలోని రాయ్ చూర్, యాదగిరి, బీదర్ జిల్లాలో గానీ తెలంగాణలో ఇస్తున్నట్లు 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు భీమా, ఇంటింటికి నీళ్లు, పింఛన్లు ఇస్తున్నారా అంటూ బండి సంజయ్ పై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
కర్నాటకలో పనులకు 40 శాతం మంత్రులకు కమీషన్లు ఇవ్వాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, గుజరాత్ లో కరెంటు కావాలని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని బీజేపీ పాలనాతీరుపై కేటీఆర్ ధ్వజమెత్తారు. రాయ్ చూర్ బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో పాలన, సంక్షేమ బాగుందని, తమను తెలంగాణలో కలపమంటున్నామంటూ విజ్ఞప్తి చేస్తున్నట్లు కేటీఆర్ గుర్తు చేశారు. పాదయాత్రను అడ్డుకునే ఖర్మ మాకు లేదని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కావాలంటే పక్కనున్న కర్నాటక వెళ్లి చూసిరా, అక్కడ బీజేపీ పాలన ఎలా ఉందో, ఇక్కడ తెలంగానలో ఎలా ఉందో చూసి సిగ్గు తెచ్చుకో అంటూ బండి సంజయ్ కి కేటీఆర్ కౌంటర్లు ఇచ్చాడు.
జోగులాంబ నుంచి పాదయాత్ర ప్రారంభించిన బీజేపీ జోగులాంబ ఆలయానికి గానీ, వేముల వాడ ఆలయానికి గానీ ఒక్క పైసా ఇచ్చిందా అని ప్రశ్నించారు. నిత్యం రాముడు రాముడు అని రామ జపం చేసే మీరు భద్రాద్రి రాముడికి ఇచ్చారా, భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ఏం చేశారని బండి సంజయ్ పై కేటీఆర్ ప్రశ్నల ద్వారా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అని ప్రగల్భాలు పలికే బండి సంజయ్ కి కేంద్రంలో ఉన్నది వాళ్ల ప్రభుత్వమన్న సోయి లేకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి రాష్ట్రానికి ఉద్యోగాలిచ్చారా, విభజన హామీలు నెరవేర్చారా అంటూ ప్రశ్నలు కురిపించారు. ఇచ్చిన హామీలను రాష్ట్రంలో మోడీకి చెప్పి అమలు చేయించే దమ్ము బండి సంజయ్ కి వుందా అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. బండి దొంగమాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని, తగిన రీతిలో తప్పకుండా బీజేపీకి , బండి సంజయ్ కి ప్రజలు బుద్ధి చెప్తారని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.