దళితబంధు యూనిట్లను పంపిణీ చేసిన మంత్రులు
వరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో దళితులకు మంచి రోజులు వచ్చాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దళితబంధు లబ్ధిదారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆమె దళితబంధు యూనిట్లను పంపిణీ చేశారు. 305 కుటుంబాలకు దళితబంధు పథకం కింద యూనిట్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని మంత్రులు తెలిపారు.ఈ బడ్జెట్ లో ప్రతీ నియోజకవర్గానికి 2వేల మందికి ఇవ్వాలని పెట్టుకున్నాం. త్వరలోనే 5, 6 వేల మంది లబ్ధిదారులకు అందచేస్తామన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ అనేక ఆలోచనలు చేసి దళిత బంధు పథకం తెచ్చారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం, సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు.
తన 40 యేండ్ల రాజకీయ జీవితంలో సీఎం కేసీఆర్ వంటి నేతను ఎక్కడా చూడలేదని మంత్రి దయాకర్ రావు కొనియాడారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రతీ దళిత కుటుంబానికి మూడేళ్లలో రూ. 10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి దయాకర్ రావు తెలిపారు. దళిత బంధు మీద రాజకీయాలు చేశారు. వేరే కులాలను పురిగొల్పారు. అయినా సీఎం కేసీఆర్ వెనుకడుగు వేయలేదన్నారు.
ప్రతి పక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని , లాభాలనిచ్చే యూనిట్లనే దళితులు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవిందర్ రావు, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, శంకర్ నాయక్, హరిప్రియ నాయక్, సీతక్క, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, కలెక్టర్ శశాంక , అదనపు కలెక్టర్ అభిలాష, ఆర్డీవో కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.