ఎంపీ పసునూరికి టికెట్ కష్టాలు ! 

ఎంపీ పసునూరికి టికెట్ కష్టాలు !

ఎంపీ పసునూరికి టికెట్ కష్టాలు ! వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి: వరంగల్ ఎంపీగా పసునూరి దయాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వ్యక్తి గతంగా ఆయన మృదు స్వభావి అయినప్పటికీ ప్రజల్లో మాత్రం ఆశించిన స్థాయిలో అభిమానాన్ని సంపాదించుకోలేకపోయారన్న విమర్శలున్నాయి.

*సొంత పార్టీలోనే గుసగుసలు
ఓరుగల్లు లాంటి గట్టి స్థానంలో ఎంపీగా ఉండడమంటే ఆషామాషీ కాదు. ఎంపీగా ప్రాతినిధ్యం వహించే నాయకుడు కూడా ఆ స్థాయిలో స్టామినా కలిగి ఉండాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధీటుగా దూసుకుపోయే లక్షణం అన్నింటికంటే ముఖ్యం. ఎర్రబెల్లి, వినయ్ భాస్కర్, రాజయ్య, కడియం లాంటి హేమాహేమీలను కలుపుకుని పోవాలి. వీళ్లందరితోనూ మంచి సంబంధాలుండాలి. ఇవన్నీ పసునూరి దయాకర్ లో లేవన్న గుసగుసలు గులాబీ శ్రేణుల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి.

* 2 సార్లు గెలిచినా పసునూరి మార్క్ లేదని టాక్
వరంగల్ ఎంపీ స్థానం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ పసునూరి దయాకర్ తనదైన మార్క్ వేయలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వరంగల్ లోక్ సభ పరిధిలోని చాలామంది ప్రజలకు ఆయన ముఖం తెలియదనే కౌంటర్లు కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. అభివృద్ధి పనుల విషయంలో లోక్ సభలోనూ ఆయన గళమెత్తిన దాఖలాలు అంతగా లేవు. మోడీ సర్కారుపై ఇతర గులాబీ ఎంపీలలాగా పసునూరి గర్జించడమూ ఎప్పుడూ చూడలేదు. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణులు కూడా పసునూరిపై అసంతృప్తిగా ఉన్నారని టాక్. పనితీరు బాగా లేకపోయినా కనీసం టాకింగ్ పవర్ తోనైనా ఆయన నెట్టుకురాలేకపోతున్నారని హైకమాండ్ కు గులాబీ నేతలు కంప్లైంట్లు కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.ఎంపీ పసునూరికి టికెట్ కష్టాలు ! *ఈ సారి కడియంకు ఛాన్స్ ఇస్తారా!
వరంగల్ లో బీజేపీ, కాంగ్రెస్ చురుగ్గా వ్యవహరిస్తుండడంతో ఈసారి ఎంపీ ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సిరిసిల్ల రాజయ్య పోటీ చేయడం ఖాయమేనని ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ నుంచి మాజీమంత్రి, సినీ నటుడు బాబూమోహన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంటే ఈ ఇద్దరు ఉద్దండులను తట్టుకుని నిలబడాలంటే పసునూరి దయాకర్ అయితే కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది. కాబట్టి ఈసారి పసునూరి స్థానంలో కొంచెం గట్టి లీడర్ ను నిలబెట్టాలని గులాబీ శ్రేణులు పార్టీ పెద్దలను కోరుతున్నారట. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హైకమాండ్ కూడా కడియం శ్రీహరి అయితే బెటర్ ఆప్షన్ అని అనుకుంటోందట. అలాగే కడియంకు ఎంపీ టికెట్ ఇవ్వడం ద్వారా ఘన్ పూర్ లో రాజయ్య- కడియం మధ్య నెలకొన్న ఫైట్ కు కూడా ఫుల్ స్టాప్ పెట్టవచ్చని ఆలోచిస్తున్నారట.

 

*వారికి బ్రేక్ వేయాలంటే కడియమే కరెక్ట్ అంటున్న విశ్లేషకులు
మొత్తంగా వరంగల్ ఎంపీ స్థానం నుంచి పసునూరి ప్లేసులో కడియంను బరిలోకి దించి, కాంగ్రెస్, బీజేపీకి బ్రేకులేయాలని గులాబీ పెద్దలు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు టాక్. కాబట్టి పసునూరి దయాకర్ కు ఈసారి టికెట్ కష్టమేనని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. చివరి నిమిషంలో ఏమైనా అనూహ్య పరిణామాలు ఎదురైతే తప్ప పసునూరి టికెట్ కు చెక్ పడినట్టేనని గులాబీ శ్రేణులు కూడా గుసగుసలాడుకుంటున్నారు. మరి ఎన్నికలు వచ్చే వరకు అధిష్టానం ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి.!!