పగిలిన మంచినీటీ పైపు లైన్.. నిద్రపోతున్న జీడబ్ల్యూఎంసీ

పగిలిన మంచినీటీ పైపు లైన్.. నిద్రపోతున్న జీడబ్ల్యూఎంసీహనుమకొండ జిల్లా : గ్రేటర్ వరంగల్ లోని 59వ డివిజన్ లోని ఎక్సైజ్ కాలనీలో మంచినీళ్లు డ్రైనేజీ పాలవుతున్నాయి. ఎక్సైజ్ కాలనీ రోడ్ నంబర్ 9లోని రాజీవ్ పార్క్ పక్కలైన్ లో వున్న అమృత రెసిడెన్సీ ఎదురుగా పైప్ లైన్ పగిలింది. దీంతో గత పది రోజులుగా నీళ్లు వృధాగా పోతున్నాయి. ప్రతీ ఒక్కరికి నీళ్లు అందాలన్న లక్ష్యంతో ఓ వైపు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పేరుతో ప్రతీ ఇంటికి నీళ్లు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని కాస్త దృష్టిలో పెట్టుకోని కొంతమంది అధికారులు, డివిజన్ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో నీళ్లు వృధాగా పోతున్నాయి. గత పది రోజులుగా నీళ్లు వృధాగా పోతున్నా పట్టించుకున్న నాథులే లేరు. ఈ విషయాన్ని ప్రజలు స్థానిక బీజేపీ కార్పొరేటర్ గుజ్జుల వసంత దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.

జీడబ్ల్యూఎంసీ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు కార్పొరేటర్ తెలిపింది. దీంతో పైప్ లైన్ లీకేజ్ అయిన దగ్గర రిపేర్ కోసం పెద్ద గోతి తవ్వి వదిలేశారు తప్ప మరమ్మత్తు మాత్రం కాలేదు. దీంతో గత పది రోజులుగా వేల కొద్ది లీటర్ల నీళ్లు డ్రైనేజీ పాలవుతున్నా ఇటు వైపే కన్నెత్తి చూడటం లేదని కాలనీ వాసులు మండిపడుతున్నారు. దీనికి తోడు త్రాగు నీటితో పాటు, ట్యాంకర్ ద్వారా నీళ్ల సప్లై లేకపోవడంతో క్యాన్ వాటర్ తెచ్చుకుని దప్పిక తీర్చుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం ప్రతీ నీటిచుక్కను ఒడిసి పడతామని చెబుతుంటే దానికి విరుద్ధంగా వేల కొద్ది లీటర్ల నీళ్లు డ్రైనేజీ పాలవుతున్నాయని స్థానికులు ముక్కునవేలేసుకుంటున్నారు.

కార్పొరేషన్ ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రతీ ఇంటికి తిరిగిన కార్పొరేటర్, గెలిచిన తర్వాత ముఖం చాటేస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇక మేయర్ గుండు సుధారాణి మాత్రం ఇటు వచ్చిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీలో పైప్ లైన్ లీకేజీ మరమ్మత్తులకు పది రోజుల సమయం పడుతుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు, స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది కాబట్టి మేయర్ ఈ విషయంపై స్పందించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. పైప్ లైన్ లీకేజీ మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేసి, నీటి వృధాను అరికట్టి, కాలనీ వాసుల దప్పికను తీర్చాలని వేడుకుంటున్నారు.