బధిర చెస్ ప్లేయర్ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్..

బధిర చెస్ ప్లేయర్ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్..హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన ఉన్నతిని చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బధిర చెస్ ప్లేయర్ మలికా హండా తన కుటుంబసభ్యులతో కలిసి ప్రగతి భవన్ లో కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా మలికా హండాకు కేటీఆర్ రూ.15 లక్షల ఆర్థిక సాయం చేశారు. చెస్ పోటీల కోసం సిద్ధమయ్యేందుకు గాను, ఆమెకు ఉపయోగపడే విధంగా ల్యాప్ టాప్ ను కూడా కేటీఆర్ బహుకరించారు. మలికాకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కేటీఆర్ కోరారు. మంత్రి కేటీఆర్ కు మలికాతో పాటు ఆమె కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

26 యేండ్ల చెస్ ప్లేయర్ మలికా జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించింది. అయినప్పటికీ తన స్వరాష్ట్రం పంజాబ్ నుంచి సరైన ప్రోత్సాహం లభించలేదు. దీంతో విసిగిపోయిన మలికా తన కోపాన్ని, బాధను ట్విట్టర్ వేదికగా వెల్లగక్కింది. బధిర ప్లేయర్ల కోసం ప్రభుత్వ ఉద్యోగాలు , నగదు ప్రోత్సాహకాలు తమ పాలసీలో లేవన్న ఆ రాష్ట్ర క్రీడా మంత్రి పర్గత్ సింగ్ ను లక్ష్యంగా చేసుకుంటూ తన కోపాన్ని వెల్లగక్కింది.బధిర చెస్ ప్లేయర్ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్..అయితే తన దృష్టికి వచ్చిన ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. మలికాకు సంబంధించి వివరాలు అందిస్తే వ్యక్తిగతంగా వీలైనంత సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. మంత్రి కార్యాలయ సిబ్బంది మలిక కుటుంబసభ్యులను వెంటనే సంప్రదించారు. తన కూతురికి మంత్రి కేటీఆర్ సాయం అందించేందుకు ముందుకు రావడంపై కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే సునీతాకృష్ణన్ ట్వీట్ కు కేటీఆర్ స్పందిస్తూ దివ్యాంగ చాంపియన్ల కోసం ప్రత్యేకంగా ఒక పాలసీ రూపొందించాలని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కోరుతూ మరో ట్వీట్ చేశారు.